వారంలో 8 కంపెనీలు నష్టపోయింది రూ.2లక్షల కోట్లు.. ఎవరెంత?
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా నేలచూపులు చూస్తున్న స్టాక్ మార్కెట్ దెబ్బకు మదుపరులు మాత్రమే కాదు.. దిగ్గజ కంపెనీలు సైతం కిందా మీదా పడుతున్నాయి.
By: Tupaki Desk | 17 Feb 2025 4:48 AM GMTఅవును.. మీరు చదివింది కరెక్టే. కేవలం వారం వ్యవధిలో టాప్ 10 కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు తమ కంపెనీ విలువలో భారీ మొత్తాన్ని నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా నేలచూపులు చూస్తున్న స్టాక్ మార్కెట్ దెబ్బకు మదుపరులు మాత్రమే కాదు.. దిగ్గజ కంపెనీలు సైతం కిందా మీదా పడుతున్నాయి. భారీ ఎత్తున మార్కెట్ విలువను కోల్పోతున్నాయి.
అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ లో విలువ పరంగా టాప్ 10 కంపెనీలుగా ఉన్న వాటిల్లో 8 కంపెనీలు కేవలం వారం వ్యవధిలో రూ.2 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోవటం గమనార్హం. ఈ భారీ నష్టంలో అగ్రస్థానంలో నిలిచింది దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్త మార్కెట్ విలువ వారంలో కోల్పోయింది ఎంతో తెలుసా? అక్షరాల రూ.67.52 వేల కోట్లు. దీంతో.. దీని మార్కెట్ విలువ రూ.16.46 లక్షల కోట్లుకు తగ్గింది. టీసీఎస్ మార్కెట్ విలువ సైతం వారంలో రూ.34,951 కోట్లకు తగ్గింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ సైతం వారంలో రూ.28,382 కోట్లను నష్టపోయింది. వారం ముందు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లకు పైనే ఉండేది.
భారీగా నష్టపోయిన ఇతర కంపెనీల్లో ఐటీసీ రూ.25,430 కోట్లు.. ఇన్పోసిస్ మార్కెట్ విలువ రూ.19,287 కోట్లు.. ఎస్ బీఐ 13,431 కోట్లు.. హిందుస్థాన్ యూనిలీవర్ రూ.10,741 కోట్లు.. బజాజ్ ఫైనాన్స్ రూ.4230 కోట్ల మేర నష్టపోయాయి. పేరున్న సంస్థలు ఇంత నష్టాల బారిన పడితే.. మరో రెండు దిగ్గజ కంపెనీలు మాత్రం లాభపడటం ఆసక్తికరంగా మారాయి. ఆ రెండు కంపెనీల విషయానికి వస్తే ఎయిర్ టెల్ మార్కెట్ విలువ రూ.22,426 కోట్లు.. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.1,182 కోట్ల మేర లాభపడటం గమనార్హం.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఎఫ్ పిఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టటం కూడా మార్కెట్ కుంగుబాటుకు కారణంగా చెప్పొచ్చు. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో రూ.21,272 కోట్ల మొత్తానికి సమానమైన ఈక్విటీలను ఉపసంహరించుకోగా.. జనవరిలో వీరు రూ.78,027 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. దీంతో.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి ఉపసంహరించిన పెట్టుబడులు ఏకంగా రూ.99,299 కోట్లుగా చెబుతున్నారు.
గత వారంలో మార్కెట్ కు దెబ్బ పడటానికి ముఖ్య కారణం.. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం.. భారీగా అమ్మకాలు చేపట్టటంతో పాటు.. క్యూ3లో కంపెనీలు ప్రకటిస్తున్న ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. ఈ కారణంగా చాలా అరుదైన పరిణామం ఒకటి నమోదైంది. నిఫ్టీ.. సెన్సెక్స్ వరుసగా ఎనిమిది రోజుల పాటు నష్టాల్లో ముగిసింది. దీని కారణంగా స్టాక్ మార్కెట్ విలువ భారీగా ఆవిరైన పరిస్థితి.