Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రమాణస్వీకార వేళ భారత్ లో టైమెంత?

ఇంతకూ ట్రంప్ ప్రమాణస్వీకారోత్స కార్యక్రమం.. మన దేశంలో ఏ టైంకు? అన్న విషయానికి వస్తే..

By:  Tupaki Desk   |   20 Jan 2025 6:27 AM GMT
ట్రంప్ ప్రమాణస్వీకార వేళ భారత్ లో టైమెంత?
X

ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం నేడు జరగనుంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్ ఆవరణలో అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ట్రంప్ ఇప్పటికే తన కుటుంబంతోకలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అక్కడ వందమంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఆ వంద మందిలో మన దేశానికి చెందిన కుబేరుడు..ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు ఉన్నారు. ట్రంప్ తో కలిసి వారు ఫోటో దిగారు.

ఇంతకూ ట్రంప్ ప్రమాణస్వీకారోత్స కార్యక్రమం.. మన దేశంలో ఏ టైంకు? అన్న విషయానికి వస్తే.. ఈ రోజు (సోమవారం) రాత్రి 10.30 గంటలకు జరగనుంది. అమెరికాకు రెండో సారి అధ్యక్షుడ్ని కావాలన్న పట్టుదలతో ప్రయత్నించి భంగపడి.. మరోసారి చేసిన ప్రయత్నంలో ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించటం తెలిసిందే. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం క్యాపిటల్ భవనం మెట్ల మీద చేస్తారు. అయితే.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి దాదాపు 25 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. అధికారులు ఈ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రమాణస్వీకారానికి ముందు సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి.. వైట్ హౌస్ కు వెళతారు. అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందుకు ట్రంప్ హాజరవుతారు. ఆ తర్వాత క్యాపిటల్ హిల్ కు చేరుకుంటారు.

భారతకాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి పదిన్నర గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డొనాల్డ్ ట్రంప్ చేత 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో ప్రారంభోపన్యాసం చేస్తారు. అమెరికా ఐక్యతే మాటగా తన స్పీచ్ ఉంటుందన్న విషయాన్ని ట్రంప్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ లో జరిగే విందులో పాల్గొంటారు. ప్రమాణస్వీకారం సందర్భంగా సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్ లను నిర్వహిస్తారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడి హోదాలో దాదాపు వంద వరకు నిర్ణయాల మీద ఆదేశాలు జారీ చేసేలా ఇప్పటికే కసరత్తు జరిగింది. మరి.. ఆ వంద నిర్ణయాలు ఏమిటి? అవెలాంటి ప్రభావాన్ని చూపుతాయి? అన్నది ప్రశ్నగా మారింది.