Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ మందుగుండు.. కేంద్రం ఏమన్నదంటే?

రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఒక్కో దేశం తమ వైఖరి ఏమిటో చెప్పేశాయి.

By:  Tupaki Desk   |   20 Sep 2024 8:43 AM GMT
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ మందుగుండు.. కేంద్రం ఏమన్నదంటే?
X

రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఒక్కో దేశం తమ వైఖరి ఏమిటో చెప్పేశాయి. భారత్ మరికొన్ని దేశాలు మాత్రమే తటస్థ వైఖరి అవలంబించాయి. భారత్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఉక్రెయిన్ యుద్ధంలో తమది తటస్థ పక్షం కాదని.. శాంతి పక్షం అని కూడా చెప్పేసింది. జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం వివాదం రాజేసినా.. ఆగస్టులో ఉక్రెయిన్ లోనూ పర్యటించి పరిస్థితిని చల్లబరిచారు. కాగా, ఈ నెలలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ రష్యా వెళ్లి మోదీ ఉక్రెయిన్ పర్యటన వివరాలను వెల్లడించారు. అయితే, ఇంతలో మరో వివాదం చుట్టుముట్టింది.

ఇచ్చింది మనం కాదు

ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ కు చెందిన మందుగుండు సామగ్రి వాడుతున్నారంటూ తాజాగా రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించింది. వాటిని శతఘ్ని తూటాలుగా పేర్కొంది. భారత్‌ కు చెందిన ఆయుధాల తయారీ సంస్థలు అమ్మిన షెల్స్‌ ను యూరప్ వినియోగదారులు ఉక్రెయిన్‌ కు మళ్లించారనేది కథనం. దీనిపై రష్యా అభ్యంతరం చెబుతున్నా.. వాణిజ్య కార్యకలాపాలను భారత్ అడ్డుకోవడం లేదని కూడా పేర్కొంది. ఉక్రెయిన్ కు ఏడాదిపైగా ఆయుధాల సరఫరా సాగిందనేది నివేదిక. రాయిటర్స్.. యూరప్, భారత్ ప్రభుత్వాలు, రక్షణ అధికారులతో మాట్లాడిన తర్వాతే తమ కథనం రాస్తున్నామని తెలిపింది.

భారత్ ఏమన్నదంటే..

భారత్ తయారీ మందుగుండును రష్యాపై ఉక్రెయన్ వాడుతోందన్న కథనాలను భారత్ గట్టిగా ఖండించింది. ఊహాజనితం, తప్పుదోవ పట్టించే కథనంగా పేర్కొంది. సైనిక, ద్వంద్వ వినియోగ సామగ్రి ఎగుమతుల్లో అంతర్జాతీయ నిబంధనలకు తాము గట్టిగా కట్టుబడి ఉంటామని స్ష్టం చేసింది. ఇప్పటివరకు భారత్ పై వీటి ఉల్లంఘనలకు సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రాలేదని తేల్చిచెప్పింది. ఆయుధాల విక్రయంలో అంతర్జాతీయ నిబంధనలను భారత్ ఉల్లంఘించిందనే అవాస్తవాలను ప్రచారం చేసేలా రాయిటర్స్ కథనం ఉందని మండిపడింది.

భారత్‌ కు చెందిన శతఘ్ని తూటాలను ఉక్రెయిన్‌ యుద్ధంలో వాడుతోందన్న కథనంలో ఏం ఉందంటే.. ‘‘తూటా షెల్స్‌ లో స్వల్ప మొత్తంలో భారత్‌ లో తయారైనవి ఉన్నాయి. అధికారులు, రక్షణ రంగ పరిశ్రమ వర్గాలు ఈ విషయం చెప్పాయి. ఉక్రెయిన్‌ కు భారత్‌ లో తయారైన పేలుడు పదార్థాలను యూరప్ లోని ఇటలీ,చెక్ రిపబ్లిక్ పంపుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కాకుండా యూరప్ లో ఉక్రెయిన్ కు పెద్దఎత్తున ఆయుధ సహకారం ఈ రెండు దేశాలదే’’ అని పేర్కొంది.