Begin typing your search above and press return to search.

నకిలీ ఉద్యోగాలతో చీటింగ్.. 540 మంది భారతీయులకు విముక్తి

దేశంలో ఇప్పుడు జాబులు దొరకడం చాలా కష్టమైంది. ఒక్క జాబు కోసం పది మంది పోటీపడుతున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2025 12:10 PM IST
నకిలీ ఉద్యోగాలతో చీటింగ్.. 540 మంది భారతీయులకు విముక్తి
X

దేశంలో ఇప్పుడు జాబులు దొరకడం చాలా కష్టమైంది. ఒక్క జాబు కోసం పది మంది పోటీపడుతున్నారు. ఎవరైనా జాబ్ ఇస్తామంటే చాలు ముందూ వెనుకా ఆలోచించకుండా వచ్చేస్తున్నారు. ఇదే సైబర్ ముఠాలకు అవకాశమైంది. కొందరు భారతీయులకు వలవేసి కల్లోల ప్రాంతాల్లో కాల్ సెంటర్లు పెట్టి వారితో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న ఘటన వెలుగుచూసింది.

నకిలీ ఉద్యోగాల ఆఫర్లతో మోసపోయి చిక్కుకున్న 540 మంది భారతీయులను మయన్మార్ సైన్యం రక్షించింది. వీరిలో 283 మందిని భారత వైమానిక దళం సోమవారం స్వదేశానికి తరలించింది. మిగతా బాధితులను మంగళవారం రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో కనీసం 42 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. విముక్తి పొందిన భారతీయుల తరలింపునకు సంబంధించి ఆయన సమాచారం పంచుకున్నారు. సైబర్ ముఠాలు నకిలీ ఉద్యోగ ఆఫర్లతో యువతను ఆకర్షించి థాయిలాండ్, కంబోడియా, లావోస్, మయన్మార్‌లలోని నకిలీ కాల్ సెంటర్లకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.

విదేశీ వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం... థాయ్‌లాండ్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ కాల్ సెంటర్లను నడుపుతున్న సైబర్ ముఠాలు బాధితులను బలవంతంగా మోసపూరితమైన సైబర్ నేరాలకు ఉపయోగించాయి. బాధితులను మయన్మార్ సైన్యం రక్షించినట్టు పేర్కొంది. మయన్మార్, థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారుల సహకారంతో వీరిని స్వదేశానికి రప్పించాయి. బాధితులను తొలుత థాయిలాండ్‌లోని మే సోట్ నగరానికి తరలించి, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి పంపించారు.

నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ ఉద్యోగ ఆఫర్లపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అంగీకరించే ముందు భారత రాయబార కార్యాలయాలు, నియామక ఏజెంట్లు, సంబంధిత కంపెనీల ద్వారా ఆ అవకాశాల నిజమైనవో కావో నిర్ధారించుకోవాలని సూచించింది.

ఇప్పటివరకు చైనాకు చెందిన సైబర్ ముఠాల నుండి 540 మంది భారతీయులను మయన్మార్ పోలీసులు రక్షించారు. అయితే స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడని దాదాపు 1500 మంది భారతీయులు ఇంకా ఈ ముఠాలలోనే ఉన్నట్టు సమాచారం. మయన్మార్‌లో రక్షించిన బాధితులను థాయ్‌లాండ్‌ సరిహద్దులోని శిబిరాలకు తరలించి, అక్కడి నుండి భారత్‌కు పంపే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలోనే వీరిని రక్షించినప్పటికీ, లాజిస్టిక్ సమస్యల కారణంగా తరలింపు ఆలస్యమైందని అధికారులు వెల్లడించారు.