Begin typing your search above and press return to search.

అమెరికా పౌరసత్వం.. జాక్‌ పాట్‌ కొట్టిన భారతీయులు!

గతేడాది అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉండటం విశేషం.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:49 AM GMT
అమెరికా పౌరసత్వం.. జాక్‌ పాట్‌ కొట్టిన భారతీయులు!
X

అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లడం, అక్కడే ఉద్యోగం సంపాదించడం, ఆ తర్వాత ఆ దేశ పౌరసత్వాన్ని పొందడం.... దాదాపు అమెరికా వెళ్లే ప్రతి భారతీయుడి కల ఇదే. మంచి ఉద్యోగాన్ని సాధించి.. అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందితే ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయేవాళ్లూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో 2023లో ఏకంగా 59 వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. గతేడాది అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉండటం విశేషం. తాజాగా 'అమెరికా పౌరసత్వం– 2023' నివేదికను ఆ దేశ విదేశాంగ విడుదల చేసింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 30, 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి గతేడాది (2023) అమెరికా 59,000 మందికి పైగా భారతీయులకు పౌరసత్వం కల్పించింది.

కాగా గతేడాది అమెరికా పౌరసత్వాన్ని అత్యధికంగా పొందినవారిలో మెక్సికన్లు ప్రథమ స్థానంలో ఉన్నారు. 2023లో 1.1 లక్షల మందికి పైగా మెక్సికన్లు అమెరికా పౌరసత్వాన్ని దక్కించుకున్నారు.

కాగా 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు. వీరిలో 1.1 లక్షలకు పైగా మెక్సికన్లు, 59,100 మంది భారతీయులు ఉన్నారు. పౌరసత్వం పొందినవారిలో మెక్సికన్లు 12.7 శాతం, భారతీయులు 6.7 శాతం ఉన్నారు.

మెక్సికో, భారత్‌ తర్వాత ఫిలిఫ్పీన్స్‌ దేశానికి చెందినవారు అత్యధికంగా అమెరికా పౌరసత్వం పొందారు. మొత్తం 44,800 (5.1 శాతం) మంది ఫిలిప్పీనియన్లకు అమెరికా పౌరసత్వం లభించింది. ఫిలిప్పీన్స్‌ తర్వాత డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన 35,200 మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. వీరు 4 శాతంగా నిలిచారు.

కాగా అమెరికా పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా వలస, జాతీయత చట్టం (ఐఎన్‌ఏ)లో నిర్దేశించిన నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి. కనీసం ఐదేళ్లు చట్టబద్ధమైన శాశ్వత నివాసి (ఎల్పీఆర్‌)గా ఉండటం తప్పనిసరి. అలాగే పౌరసత్వాన్ని పొందేందుకు అమెరికా పౌరులను జీవిత భాగస్వామిగా కలిగివుండడం లేదా మిలటరీ సేవలో ఉండడంతో పాటు పలు సాధారణ నిబంధనలను అర్హతలుగా కలిగి ఉండాలి. అమెరికన్‌ పౌరులను పెళ్లి చేసుకున్నవారికి మూడేళ్ల వ్యవధికే అమెరికా పౌరసత్వం లభిస్తుంది.

2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వం అందుకున్నవారిలో చాలా మంది ఐదేళ్ల చట్టబద్ద నివాసం ద్వారా అర్హత పొందినవారేనని నివేదిక వెల్లడించింది.