ఇక చైనాకు దబిడ దిబిడే.. ఆ ఫైటర్ జెట్ల తయారీ ఇండియాలోనే!
పదేపదే సరిహద్దుల్లో కవ్విస్తూ.. భారత ప్రాంతాలను తన ప్రాంతాలుగా చూపుకుంటూ మ్యాపులు విడుదల చేస్తున్న చైనాకు భారత్ గట్టి షాక్ ఇస్తోంది
By: Tupaki Desk | 31 Aug 2023 10:24 AM GMTపదేపదే సరిహద్దుల్లో కవ్విస్తూ.. భారత ప్రాంతాలను తన ప్రాంతాలుగా చూపుకుంటూ మ్యాపులు విడుదల చేస్తున్న చైనాకు భారత్ గట్టి షాక్ ఇస్తోంది. చైనా ఫైటర్ జెట్ల కంటే ఎంతో సమర్థవంతమైన అమెరికా ఫైటర్ జెట్ల తయారీని భారత్ లో చేపట్టనున్నారు. ఇందుకు అమెరికా కాంగ్రెస్ తాజాగా అంగీకారం తెలిపింది.
అమెరికా ప్రభుత్వ నిర్ణయం.. భారత్ దేశీయ ఫైటర్ జెట్‌ల తయారీలో భారీ ముందడుగుగా రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక యుద్ధవిమానాల తయారీని భారత్ లోనే చేపట్టనున్నారు. వీటికి చైనా యుద్ధ విమానాలు సరితూగలేవని అంటున్నారు.
అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థ.. భారత్ కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి భారత్ లోనే ఎఫ్414 ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఈ ఇంజన్లతో భారత్ వాయుసేన సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాకు చెందిన అత్యున్నత శ్రేణి జెట్ ఫైటర్ ఇంజిన్లను భారత్ లోనే తయారు చేయడానికి వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం కింద దాదాపు 80 శాతం టెక్నాలజీని జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ భారత్ కు అందిస్తుంది. దీంతో భారత వాయుసేన ఉపయోగించే తేజస్ ఎంకే2కు అవసరమైన ఇంజిన్ల తయారీ తేలికవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో దేశీయంగానే తయారు చేసిన విమాన ఇంజిన్లను మన జెట్లకు అందించేందుకు తాజా ఒప్పందం మార్గం సుగమం చేస్తోందని అంటున్నారు.
కాగా అమెరికా-భారత్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 99 ఇంజిన్లను జీఈ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తాయి. టెక్నాలజీని భారత్ కు బదలాయించడం వల్ల వీటిని అతి తక్కువ ధరలోనే నిర్మించడం కుదురుతుంది. కాగా ఎఫ్414 ఇంజిన్‌ను ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు అత్యుత్తమ ఫైటర్ జెట్లు ఉపయోగించాయి.
మరోవైపు చైనా టెక్నాలజీలో ఎంత ముందున్నా.. ఇప్పటి వరకు సొంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని అంటున్నారు. ఆ దేశానికి చెందిన జే-20 ఫైటర్ జెట్ల కోసం చైనా సొంతంగా షెన్యాంగ్ డబ్ల్యూ-10పేరుతో ఇంజిన్లను అభివృద్ధి చేసినా అవి పాశ్చాత్య దేశాల ఇంజిన్లతో పోటీపడగల స్థాయిలో లేవని తెలుస్తోంది. దీంతో రష్యాకు చెందిన ఏల్-31 శ్రేణి ఇంజిన్ల టెక్నాలజీని కాపీ కొట్టి చైనా ఫైటర్ జెట్లను తయారుచేస్తోంది. అయినా సరే షెన్యాంగ్ డబ్ల్యూ-10 సామర్థ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డబ్ల్యూ-15 రకంపై చైనా దృష్టిపెట్టింది.
ఇప్పుడిక భారత్‌లో ఎఫ్414 ఇంజిన్ల తయారీ మొదలైతే.. చైనాకు ఇక దబిడదిబిడేనని అంటున్నారు. ఈ ఇంజిన్లను ఇప్పటికే అమెరికా తన నౌకాదళంలోని ఎఫ్-18 సూపర్ హార్నెట్, ఈఏ-18జీ గ్రౌలర్, ఐరోపాకు చెందిన సాబ్ కంపెనీ తయారీ గ్రిపిన్ ఫైటర్ జట్లకు వాడుతోంది. ఇప్పుడు వీటినే మన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ ల్లో కూడా వాడనున్నారు.