Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ ఎఫెక్ట్‌.. ఇండియా కూట‌మిపై ఒత్తిడి!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 March 2024 4:30 PM GMT
కేజ్రీవాల్ ఎఫెక్ట్‌.. ఇండియా కూట‌మిపై ఒత్తిడి!
X

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌భావం ఒక్క ఆయ‌న పార్టీ ఆమ్ ఆద్మీపైనే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి పార్టీలపైనా ప‌డింది. ఇప్పుడు కేజ్రీవాల్‌ను ర‌క్షించుకోక‌పోతే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి స‌గానికిపైగా పార్టీల అధినేతలు జైలు బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ఇండియా కూట‌మి నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్‌ను సాధ్య‌మైనంత వేగంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల‌నే వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``ఆయ‌న‌ను త‌క్ష‌ణం బ‌య‌ట‌కు తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంది. ఏం చేయాలనే దానిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వెంటనే ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి`` అని ఆయన అన్నారు. కూటమి బలంగా ఉండాలనే విషయాన్ని తాను ముందు నుంచి చెపుతూనే ఉన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

లిక్కర్ పాలసీ కేసు జీరో కేసు అని... అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల పైనే కేసు ఆధారపడి ఉందని అన్నారు. ఈ కేసులో ఆధారాలు లేవని, జరుగుతున్న తతంగం అంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు. మ‌రోవైపు.. ఆప్ సీనియ‌ర్ నాయ‌కురాలు, ఢిల్లీ మంత్రిఅతిషి కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇండియా కూట‌మిని దెబ్బ‌తీసేందుకు బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను సామూహికంగా ఎదుర్కొనవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె చెప్పారు.

ఈడీని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకోవడం సరైనది కాదని, దమ్ముంటే తమతో ఎన్నికల క్షేత్రంలో తలపడాలని మంత్రి అతిషి బీజేపీకి సవాల్ విసిరారు. ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఈ రకంగా గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మాన్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.