Begin typing your search above and press return to search.

కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇండియా పేరు ఇక భారత్‌?!

దేశంలో ఒకేసారి రాష్ట్రాలకు, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరపాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   5 Sep 2023 9:33 AM GMT
కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇండియా పేరు ఇక భారత్‌?!
X

దేశంలో ఒకేసారి రాష్ట్రాలకు, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరపాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా పేరును ఇక కేవలం ''భారత్‌' గా మాత్రమే పిలిచేలా పేరు మార్చడానికి యోచిస్తున్నట్టు సమాచారం.

వాస్తవానికి మనదేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్లు మనను ఇండియా అని పిలిచారు. ఇండస్‌ నది (సింధు నది) ఒడ్డున నివసించే ప్రజలం కాబట్టి, ఇండస్‌ వ్యాలీ సివిలైజేషన్‌ (సింధు లోయ నాగరికత) విలసిల్లిన దేశం కాబట్టి బ్రిటిషర్లు మనదేశాన్ని తొలిసారి ఇండియాగా పిలిచారు.

అయితే పురాణాల ప్రకారం.. భరతుడు అనే రాజు మనదేశాన్ని పరిపాలించాడని .. ఆయన పేరు మీదుగానే భారతదేశం అని పేరు వచ్చిందని పాఠ్యపుస్తకాల్లో ఉంది. అయితే ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు మనల్ని ఇండియాగానే గుర్తిస్తున్నాయి. అలాగే భారత జాతీయులను ఇండియన్స్‌ గానే పిలుస్తున్నాయి.

మరోవైపు ఇటీవల 28 ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. అప్పట్లోనే ఈ పేరుపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. భారత్‌ అనే దేశానికి ఈ ఇండియా కూటమి వ్యతిరేకమని ధ్వజమెత్తింది.

ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికల కోసం సెప్టెంబర్‌ నెలలో ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే ఇండియా పేరును భారత్‌ గా మార్చే బిల్లును కూడా ప్రవేశపెడుతోందని అంటున్నారు. దీనిపై తీర్మానం చేసి పార్లమెంటులో పెడతారని చెబుతున్నారు.

భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ–20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై ''ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా'' బదులుగా ''ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌'' అని ముద్రించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడీ ఈ అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది.

తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. జీ–20 విందు కోసం ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపిందని మండిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇంతకుముందు 'ఇండియా: అది భారత్‌' అని ఉంటుందని గుర్తు చేసింది. కానీ ఇప్పుడు మోదీ సర్కార్‌ వల్ల దీన్ని.. 'భారత్, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య' అని చదవాల్సి ఉంటుందని ధ్వజమెత్తింది. ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సోషల్‌ మీడియాలో నిప్పులు చెరిగారు.

మరోవైపు జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌ లెట్‌ లోనూ దేశం పేరు 'భారత్‌' అని పేర్కొనడం విశేషం. 'భారత్, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ' అని అందులో పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. ఈ నెలలో 18–22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తెస్తుందని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగంలో 'ఇండియా: దటీజ్‌ భారత్‌' అని ఉండగా.. ఇకపై 'భారత్‌' అనే పేరు మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు సమాచారం.