ఇండియా పేరు మార్పు.. రాజ్యాంగ నిపుణులు చెబుతున్నదిదే!
ఇండియా అనే పేరును భారత్ అని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి
By: Tupaki Desk | 6 Sep 2023 5:25 AM GMTఇండియా అనే పేరును భారత్ అని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు దేశంలో ఒకేసారి రాష్ట్రాలకు, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు నిర్వహించే అంశంపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతలోనే దేశం పేరు మార్పు అంశం కూడా తెరపైకి వచ్చింది. దీంతో అనుకూలంగా, వ్యతిరేకంగా పార్టీలు, వ్యక్తులు విడిపోయారు.
కొంతమంది నెటిజన్లతోపాటు ప్రముఖులు సైతం ఇండియా పేరును భారత్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది ఇప్పుడున్నట్టే ఇండియా, భారత్ గా ఉంచాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు దేశం పేరు మార్చడం అంత సులువైన పనికాదని అంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఐదు సవరణలు చేయాల్సి ఉంటుందని.. భారత పార్లమెంటులో రెండు సభల్లోనూ 60 శాతానికి పైగా మెజారిటీ ఉండాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'ఇండియా, ఇది భారత్' అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 చెబుతోందని అన్నారు. అయితే రెండింటినీ పరస్పరం మార్చుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు.
'రిపబ్లిక్ ఆఫ్ ఇండియా'లో ఏదైనా మార్పులు చేయాలంటే అనేక సవరణలు చేయాల్సి ఉంటుందని ఆచారి వెల్లడించారు. పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్టికల్ 1ను తప్పకుండా మార్చాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్టికల్-1 ను మారిస్తే.. దీంతోపాటు మిగిలిన ఆర్టికల్స్ లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలో 'ఇండియా' అని ఉన్న ప్రతిచోట మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు.
దేశానికి ఒక్క పేరు మాత్రమే ఉంటుందని పీడీటీ ఆచారి తెలిపారు. పరస్పరం మార్చుకునే రెండుపేర్లు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దేశానికి రెండు పేర్లు ఉంటే స్వదేశంతోపాటు విదేశాల్లోనూ గందరగోళం ఉంటుందని చెప్పారు.
ఐక్యరాజ్యసమితిలో భారత పేరు 'రిపబ్లిక్ ఆఫ్ ఇండియా'గా ఉందని ఆచారి గుర్తు చేశారు. ఒకవేళ దాన్ని భారత్ గా మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందన్నారు. పేరు మార్చాక తమ పేరు మారిందంటూ సంబంధిత అన్ని దేశాలకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు.
పేరు మార్పునకు రాజ్యాంగంలో సవరణ చేయడం తప్పనిసరి అని ఆచారి తేల్చిచెప్పారు. సవరణ చేయకుంటే ఇండియాగానే ఉంటుందన్నారు. 'ఇండియా, ఇది భారత్' అని ఆర్టికల్ 1లో పేర్కొన్నది కేవలం వివరణ కోసం మాత్రమేనన్నారు. అంతేతప్ప ఈ రెండు పరస్పరం మార్చుకోవచ్చని కాదని పేర్కొన్నారు. అలా మార్చుకోవడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభిప్రాయపడ్డారు.. ఒక దేశానికి ఒకే పేరు ఉంటుంది అని స్పష్టం చేశారు.