Begin typing your search above and press return to search.

విరాట్ "కోట్లీ" అనాలేమో? ఇన్ స్టా పోస్టు ధరెంతో తెలుసా?

ఇన్‌ స్టాగ్రామ్‌ లో సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు అతడు వసూలు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల ఏడాది కాంట్రాక్టు కంటే ఎక్కువ.

By:  Tupaki Desk   |   11 Aug 2023 12:13 PM GMT
విరాట్ కోట్లీ అనాలేమో? ఇన్ స్టా పోస్టు ధరెంతో తెలుసా?
X

ఆటగాడిగా అతడికి వయసు మీద పడుతుందని అనొచ్చు.. టి20ల నుంచి గౌరవంగా తప్పించారని చెప్పొచ్చు.. వన్డేల్లోనూ అంతంతగానే ఆడుతున్నాడని నిందించొచ్చు.. కానీ, అతడి స్థాయి అతడిదే. దేంట్లోనూ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. సోషల్ మీడియా యుగంలో స్పోర్ట్స్, సినీ స్టార్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా ఉంటోంది. అది వారి వార్షిక కాంట్రాక్టుల కంటే ఎక్కువ కావడం విశేషం. ఇక టీమిండియాలో సూపర్ స్టార్ బ్యాట్స్ మన్ అయిన విరాట్ కోహ్లికి ఇంకెంత డిమాండ్ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడలాంటి నివేదికే బయటకు వచ్చింది.

ఊహించగలమా.. ఆ మొత్తాన్ని? కోహ్లి టీమిండియా కెప్టెన్సీ వదిలేసి ఏడాదిన్నర అవుతోంది. అంతకుముందు రెండేళ్లు అతడి ఫామ్ సరిగా లేదు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మొత్తానికి ఏడాది కిందట టి20ల్లో సెంచరీ కొట్టాడు. పొట్టి ఫార్మాట్ లో అతడికిదే మొదటి సెంచరీ. ఇక అప్పటినుంచి వన్డేల్లో నిలకడగా ఆడుతున్నాడు.

ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో టెస్టు శతకమూ అందుకున్నాడు. ఇప్పుడు కోహ్లి వయసు 34. టి20లకు అతడిని పరిగణించడం లేదు. వచ్చే ప్రపంచ కప్ తర్వాత వన్డేలనూ వదులుకుని టెస్టులపై పూర్తిగా చూపు నిలిపే చాన్సుంది. ఈ నేపథ్యంలోనే కెరీర్ లో కీలక దశలో ఉన్నాడని చెప్పవచ్చు. కాగా..కొత్త తరం దూసుకొస్తున్నప్పటికీ కోహ్లివే దేశంలో అత్యంత ఖరీదైన ఇన్‌ స్టా పోస్టులు కావడం విశేషం.

ఏక్ ధమ్ రూ.11 కోట్లు సోషల్ మీడియాలో కోహ్లి ఫాలోయింగ్ బీభత్సం. ఇన్‌ స్టాగ్రామ్‌ లో సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు అతడు వసూలు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల ఏడాది కాంట్రాక్టు కంటే ఎక్కువ. హూపర్‌ హెచ్‌ క్యూ జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ సంస్థ ఇన్‌ స్టాలో అత్యధిక మొత్తం ఛార్జి చేసే 20 పేర్లను ఇవ్వగా.. కోహ్లిది అందులో 14వ స్థానం.

అతడు సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు రూ.11 కోట్లు తీసుకుంటున్నాడు. కాగా.. ఇన్ స్టాలో కోహ్లికి 25.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అయితే, హూపర్‌ జాబితాలో టాప్ 20లో కోహ్లికే చోటు దక్కింది. హాలీవుడ్-బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు 29వ స్థానం దక్కింది. ఈమె ఒక్క ఇన్ స్టా పోస్టుకు రూ.4.4 కోట్లు వసూలు చేస్తోంది.

ఇక్కడా రొనాల్డో, మెస్సీ మధ్యనే పోటీ ఫుట్ బాల్ ప్రపంచంలో ప్రస్తుతం దిగ్గజాలు ఎవరంటే.. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), లయోనల్ మెస్సీ (అర్జెంటీనా). 20 ఏళ్లుగా వీరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు హూపర్ జాబితాలోనూ అంతే. అయితే, ఇక్కడ మెస్సీని రొనాల్డో బీట్ చేశాడు. 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక పోస్టుకు రూ.26.7 కోట్లు చార్జి చేస్తున్నాడు. ఇక మెస్పీకి 47.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు రూ.21 కోట్లు వసూలు చేస్తున్నాడు.