Begin typing your search above and press return to search.

ఐపీసీ..సీఆర్పీసీకి చెల్లు.. కొత్త చట్టాలొస్తున్నాయ్..

ఇదే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును పంతంపట్టి మరీ నెగ్గించుకున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Aug 2023 9:33 AM GMT
ఐపీసీ..సీఆర్పీసీకి చెల్లు.. కొత్త చట్టాలొస్తున్నాయ్..
X

దేశంలో ఇప్పటివరకు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నాయి. ఇకపై వీటికి కాలంచెల్లనుంది. కొత్త చట్టాలు రానున్నాయి.

దాదాపు 80 ఏళ్లుగా భారతీయ సమాజంలో తెలిసిన పేర్లు ఐపీసీ, సీఆర్పీసీ. వీటితో పాటు సాక్షి చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) కూడా ఉంది. అనేక కేసుల్లో, వాదనల్లో, కోర్టుల తీర్పుల్లో, పత్రికల్లో ఈ పేర్లు వినే ఉంటారు. ఓ కేసులో నేరం నిరూపణ అయినవారికి శిక్షలు విధించే సమయంలో ఐపీసీ పేరు ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు ఈ మూడు చట్టాలకు మంగళం పాడనుంది కేంద్ర ప్రభుత్వం. వీటి స్థానంలో కొత్తగా చట్టాలను తెస్తోంది. దీనికి సంబంధించి మూడు బిల్లులను లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రవేశపెట్టారు.

ఈ సమావేశాల్లో అన్నీ కీలకమే..

పార్లమెంటు కొత్త భవనంలో తొలిసారిగా సమావేశాలు జరుగుతున్నాయి. వర్షాకాల సమావేశాలకు శుక్రవారం చివరి రోజు. గత నెల 20న ప్రారంభమైన సమావేశాలకు ఆది నుంచి మణిపూర్ అంశం అడ్డుతగిలింది. ఈశాన్య రాష్ట్రం పరిస్థితులపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి గట్టి పట్టు పట్టింది. అవిశ్వాస తీర్మానమూ ప్రవేశపెట్టింది. చివరకు గరువారం అది వీగిపోయింది. ప్రధాని మోదీతో మణిపూర్ పై మాట్లాడించాలన్న ప్రతిపక్షాల పట్టు మాత్రం నెరవేరింది.

కాగా, ఇదే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును పంతంపట్టి మరీ నెగ్గించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మరికొన్ని కీలక అంశాల్లో మార్పులకు సంబంధించిన బిల్లులనూ కేంద్రం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏకంగా ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు తెచ్చేందుకు బిల్లుపెట్టింది. వాస్తవానికి మూడేళ్ల నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆయన గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ టర్మ్ ముగుస్తుండగా ఇప్పడు బిల్లులు పెట్టారు.

ఇంగ్లిష్ తీసేసి.. భారతీయ పేర్లు..

నేర- న్యాయ వ్యవస్థలో కీలక మార్పునకు సిద్ధమైన కేంద్రం ఐపీసీ, సీఆర్సీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో తీసుకొస్తున్న చట్టాలకు భారతీయ పేర్లను పెట్టింది కేంద్ర ప్రభుత్వం. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య పేరిట తెచ్చిన ఈ బిల్లులను పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని అమిత్ షా చెప్పారు ఐపీసీ, సీఆర్సీసీ, ఎవిడెన్స్ చట్టాలను బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలుగా షా అభివర్ణించారు. ఆంగ్లేయులు వారి పాలనను కాపాడుకోవడం, మరింత బలోపేతం కావడం , అడ్డు వచ్చినవారిని శిక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లులను ప్రవేశపెట్టారని విమర్శించారు. అంతేగాని.. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

న్యాయం అందిచడమే కొత్త చట్టాల లక్ష్యం

ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానాల్లో ప్రవేశపెట్టనున్న చట్టాలు పౌరుల హక్కులను కాపాడతాయని అమిత్ షా వివరించారు. బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం కొత్త చట్టాల లక్ష్యం. అయితే.. నేరాలను అరికట్టే లక్ష్యంతో శిక్షలు ఉంటాయి' అని స్పష్టం చేశారు. మొత్తానికి బ్రిటిషర్ల కాలం ఐపీసీ, సీఆర్పీసీలకు ఇలా కాలంచెల్లింది. వాటి ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.