ఆ దేశంలో మరో దారుణం.. భారత సంతతి కుటుంబంది హత్యా, ప్రమాదమా?
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు శవ పరీక్ష జరిపారు.
By: Tupaki Desk | 16 March 2024 6:45 AM GMTకెనడాలో దారుణ విషాదం చోటు చేసుకుంది. ఒంటారియో ప్రావిన్స్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 7వ తేదీ రాత్రి బ్రాంప్టన్ లోని వారి నివాసంలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు శవ పరీక్ష జరిపారు.
ఈ పరీక్షల ద్వారా మృతులను ఆ ఇంట్లో నివాసం ఉంటున్న రాజీవ్ వరికూ(51), భార్య శిల్ప కొత్త(47) వారి కుమార్తె మహెక్ వరికూ(16)గా గుర్తించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై అగ్నిమాపక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదమై ఉండదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో సీసీ పుటేజీతోపాటు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు ఒక ఫోన్ నంబర్ ను ఇచ్చారు.
కాగా మృతుడు రాజీవ్ వారికూ.. ఫోర్సెస్ ఆక్సిలరీ ప్రోగ్రామ్ లో సభ్యుడని పోలీసులు తెలిపారు.
అగ్నిప్రమాదానికి, కుటుంబంలోని ముగ్గురు సభ్యుల మరణానికి దారితీసిన కారణాలను కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన పట్ల
ఇరుగుపొరుగువారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు
ఇంట్లో మంటలు చెలరేగడంతో పాటు భారీ పేలుడు శబ్ధం వినిపించిన సమయంలో తాను తన ఇంట్లో ఉన్నానని పొరుగు వ్యక్తి నికోలస్ ఖాకిష్ వెల్లడించారు. ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని, ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన తెలిపారు.
కాగా మృతుల కుటుంబానికి మూడేళ్లుగా పొరుగునే ఉంటున్న మరో భారతీయుడు శ్రీ నంద్యాల మాట్లాడుతూ ఈ ఘటన పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతవ్వడం, ఇంత చిన్న వయసులోనే మృతిచెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.