సునీతా.. గణేశుడి సాక్షిగా అంతరిక్ష ఘన చరిత్ర
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ 58 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించారు
By: Tupaki Desk | 6 Jun 2024 1:02 PM GMTభారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ 58 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించారు. ఈసారి గణేశుడి సాక్షిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఇది ఆమె మూడో అంతరిక్ష యాత్ర మరో సహచరుడితో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో బయల్దేరిన సునీత.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. సునీతా స్టార్ లైనర్ యాత్ర జూన్ 5న అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 ద్వారా మొదలైంది.
ఆయనకూ రికార్డే..
యాత్రలో సునీతాతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఈయనకూ ఇది రికార్డు స్థాయి యాత్రనే. మరోవైపు వివిధ కారణాల వల్ల బోయింగ్ స్టార్ లైనర్ విమానానికి పలుసార్లు అంతరాయం కలిగింది. అన్నీ సర్దుకున్నాక ప్రయాణం మొదలై విజయవంతంగా పూర్తయింది.
18 ఏళ్ల కిందట..
సునీతా విలియమ్స్ 2006లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లారు. 2012లో రెండోసారి ఈ యాత్ర చేశారు. తాజాగా మూడోసారి ప్రయాణమయ్యారు. 1987లో అమెరికా నావల్ అకాడమీలో శిక్షణ పొందిన సునీతా.. తర్వాత ఆ దేశ నేవీలో చేరారు. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. కాగా, అమెరికన్ ను వివాహం చేసుకున్నప్పటికీ సునీతా విలియమ్స్ హిందూ దేవుళ్లను పూజిస్తుంటారు. తన ఇష్టదైవం గణేషుడిని ప్రతిమను అంతరిక్షానికి తీసుకువెళ్లారు. గతంలో రెండుసార్లు వెళ్లినప్పుడు భగవద్గీతను వెంట పెట్టుకెళ్లారు. ఈసారి వినాయకుడు తోడుగా ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణంలో తనకు అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పారు.
14న తిరిగి రాక
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు అంతరిక్ష కేంద్రంలో వారం పాటు ఉంటారు. ఈ నెల 14న తిరిగి భూమ్మీదరకు వస్తారు. వీరి ప్రయాణానికి సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది.