దేశానికి అత్యున్నతమైన నేతలను అందించిన హస్తిన... లిస్ట్ ఇదే!
దేశరాజకీయాల్లో హస్తినకున్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశరాజధానిగా హస్తినకున్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం
By: Tupaki Desk | 26 May 2024 3:15 AM GMTదేశరాజకీయాల్లో హస్తినకున్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశరాజధానిగా హస్తినకున్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. స్వాతంత్రానికి ముందు నుంచీ ఏ కోణంలో చూసినా హస్తిన తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది. ఇక స్వాతంత్రానంతరం ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఎంపీలుగా ఎన్నికైన నేతలు దేశానికి అత్యున్నతమైన నేతల్లో ఒకరిగా నిలిచారు.
అవును... స్వాతంత్రానంతరం దేశరాజకీయాల్లో కీలక భూమిక పోషించిన నేతలు, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు ఎంతో మంది ఉన్నారనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో వారిలో ముగ్గురు కీలక నేతలు మాత్రం తొలిసారిగా వారి పొలిటికల్ కెరీర్ ను ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచే ప్రారంభించారు. వారిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కాగా.. ఒకరు ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారు.
సుచేతా కృపలానీ:
ఇలా ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, దేశ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో మొదటిగా వినిపించే పేరు సుచేతా కృపలానీ. ఆమె 1952లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత 1960లో ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రి పదవి చేపట్టారు. మూడేళ్ల తరువాత 1963లో ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
లాల్ కృష్ణ అద్వానీ:
ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా తొలిసారిగా 1989లో ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత దేశానికి ఉప ప్రధానిగా కూడా సేవలందించారు. 1991లో న్యూ ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేష్ ఖన్నాను ఓడించారు. ఈ క్రమంలోనే ఎల్.కే. అద్వానీ కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
సుష్మా స్వరాజ్:
బీజేపీ దిగ్గజ నేత, ఢిల్లీ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లోక్ సభకు చేరుకున్నారు. 1996లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత ఆమె అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. తరువాత ఆమె 1998లో దక్షిణ ఢిల్లీ నుంచి మరోసారి గెలిచారు.
ఫలితంగా మరోమారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే సాహిబ్ సింగ్ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. 2009-2014 మధ్యకాలంలో ఆమె లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా వ్యవహరించారు. అనంతరం మోడీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు.