Begin typing your search above and press return to search.

యూఎస్ లో కార్చిచ్చు... భారతీయుల పాట్లు ఇవే!

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో చెలరేగిన కార్చిచ్చు ఊహించని నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 8:30 AM GMT
యూఎస్ లో కార్చిచ్చు... భారతీయుల పాట్లు ఇవే!
X

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో చెలరేగిన కార్చిచ్చు ఊహించని నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా లక్షల కోట్ల నష్టాన్ని కలిగించిందని చెబుతున్నారు. వేల కట్టడాలూ బూడిదవ్వగా.. లక్షల మంది ప్రజలు తట్టా బుట్టా సర్ధుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ సమయంలో భారతీయ సంతతి ప్రజలు స్పందిస్తున్నారు.

అవును... లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు తీవ్ర వినాశనాన్ని కలిగిస్తుందని అంటున్నారు. ఈ కార్చిచ్చుతో ఇప్పటివరకూ పదిమంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 వేల కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్చిచ్చు కారణంగా సంభవించిన ఆస్తినష్టం విలువ సుమారు 150 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్లు) కు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

మరోపక్క.. సుమారు మూడున్నర లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేయగా.. వేల ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి. ఈ సమయంలో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక దళాలకు శక్తికి మించిన పనిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ లో ఆఫీసులు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాలిఫోర్నియాలోని భయానక అనుభవాలను పంచుకుంటున్నారు భారతీయ అమెరికన్లు. ఈ సందర్భంగా స్పందించిన భారతీయ సంతతికి చెందిన మొయిరా శౌరీ ఈ దృశ్యాన్ని సంపూర్ణ వినాశనంగా అభివర్ణించారు. ఆమె ఫ్యామిలీ లాస్ ఏంజెలిస్ లోని డౌన్ టౌన్ హోటల్ ను బలవంతంగా ఖాళీ చేయాల్సి వచ్చినట్లు తెలిపారు.. పరిస్థితులు తారు మారైనట్లు వెల్లడించారని అంటున్నారు!

ఒకప్పుడు కుబేరుల కాలనీగా, సెలబ్రెటీల స్ట్రీట్ గా ఉంటూ సంపదతో తులతూగిన లాస్ ఏంజెలెస్ నగరం నేడు మరుభూమిని తలపిస్తోందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎగసిపడుతున్న మంటలు, పొగ.. అంతరిక్షంలోని ఉగ్రహాలకూ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.