అక్రమంగా అమెరికాకు...రికార్డ్ స్థాయిలో దొరుకుతున్న ఇండియన్స్!
కెనడా నుండి చట్టవిరుద్ధంగా యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని కెనడియన్ అధికారులు చెబుతుంటారు
By: Tupaki Desk | 26 Oct 2023 4:50 AM GMTకెనడా నుండి చట్టవిరుద్ధంగా యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని కెనడియన్ అధికారులు చెబుతుంటారు. దీనికి సంబంధించిన వార్తలు రెగ్యులర్ గా మీడియాలో దర్శనమిస్తుంటాయి. పైగా ఇలా అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో చాలా మంది మృత్యువాతపడుతుంటారు. ఈ విషయంలో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని.. అందులోనూ గుజరాతీయుల సంఖ్య అధికంగా ఉందని పలు కథనాలు ఇప్పటికే వెలుగుచూశాయి.
ఈ నేపథ్యంలో కెనడా సరిహద్దుల నుంచి అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని, ఇది ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు! ఈ క్రమంలో ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాల్లో పలువురు భారతీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కెనడాలో నివసిస్తున్న పలువురు భారతీయ వలసదారులు అమెరికాలోని సియాటల్ కు అక్రమంగా ప్రవేశిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇలా అక్రమంగా ప్రవేశించే సమయంలో గతేడాది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మిన్నెసోటా సరిహద్దుకు ఉత్తరాన కొన్ని అడుగుల దూరంలో ఉన్న మానిటోబాలో వీరి మృతదేహాలను గడ్డకట్టిన స్థితిలో అధికారులు గుర్తించారు! బహుశా మంచు తుఫానులో చిక్కుకున్నారని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతున్నాయని... యూఎస్ లోకి ఎంటరవ్వడానికి అధికారిక మార్గాలను ఎంచుకోవాలి తప్ప.. ఇలా అక్రమ దారులను ఎంచుకోవద్దని యూఎస్ అధికారులు నిత్యం చెబుతూనే ఉంటారు. అమెరికా సరిహద్దు గస్తీ ఏజెన్సీ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీబీపీ) దీనిపై నిత్యం నిఘా పెడుతుంటుందని అంటారు!
ఈ క్రమంలో... కెనడా నుంచి యూఎస్ కి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ఈ ఏడాది ఆగస్టులో ఇలా అక్రమ చొరబాటుకు యత్నించిన సుమారు 2,327 మంది భారతీయులు పట్టుబడగా... సెప్టెంబర్ లో వీరి సంఖ్య 3,059గా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదే సమయంలో.. వీరిలో గుజరాతీయులు ఎక్కువగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా... 2019 ఫిబ్రవరి నుంచి 2023 మార్చి మధ్య ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించిన 1.90 లక్షల మంది భారతీయులు పట్టుబడటం గమనార్హం!