స్విస్ బ్యాంక్ చేరని భారతీయుల డబ్బు.. ఎటు పోతుందో మరి?
స్విస్ బ్యాంకులో నిధుల నిల్వల్లో బ్రిటన్ ది టాప్ ప్లేస్. అమెరికా రెండో స్థానంలో ఉంది. కాగా, ఇండియన్స్ డిపాజిట్లు ఒక్క 2023లోనే దాదాపు 25 శాతం పడిపోయి రూ.63 కోట్లకు చేరాయి.
By: Tupaki Desk | 22 Jun 2024 4:30 PM GMTగతంలో భారతీయులు అక్రమ సంపాదనను గానీ, అధిక సంపాదనను గానీ.. స్విస్ బ్యాంకుల్లో దాచారనే వ్యాఖ్యలు అధికంగా వినిపించేవి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో ఇలాంటి ఆరోపణలు అధికంగా వచ్చేవి. నరేంద్ర మోదీ అయితే 2014లో ప్రధాని కాకముందు ఏకంగా స్విస్ బాంకులు సహా విదేశాల్లో పోగుబడిన అక్రమార్కుల సంపాదనను బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో వేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. అయితే, ఆచరణలో అది సాధ్యం కాదని తేలిపోయింది. మరోవైపు ఇప్పటికీ మనవారు స్విస్ బ్యాంకులో డబ్బులు దాస్తూ వస్తున్నారు.
ధన రాశులు తగ్గుతున్నాయ్..
భారతీయులు కానీ, భారతీయ సంస్థలు కానీ ఇటీవలి కాలంలో స్విస్ (స్విట్జర్లాండ్) బ్యాంకుల్లో చేసే డిపాజిట్లు తగ్గుతున్నాయి. నిరుడు ఈ మొతం ఏకంగా 70 శాతం తగ్గి కనిష్ట స్థాయి రూ.9,771 కోట్లకు (1.04 స్విస్ ఫ్రాంక్‌లు) చేరింది. స్విట్జర్లాండ్ లోని స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ డబ్బును స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు.
వరుసగా రెండో ఏడాది..
స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం సంపద తగ్గడం ఇదే మొదటిసారి కాదు. వరుసగా రెండో సంవత్సరం కూడా క్షీణత కనిపించింది. 2021లో గరిష్ఠ స్థాయి 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. కాగా, క్షీణతకు ప్రధాన కారణం బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా నిల్వ చేసిన సంపద తగ్గిపోవడమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. అదనంగా, కస్టమర్ డిపాజిట్ ఖాతాలలో డిపాజిట్లు, భారత్ లోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించే నిధులు కూడా గణనీయంగా తగ్గాయి.
వారిదే పైచేయి..
స్విస్ బ్యాంకులో నిధుల నిల్వల్లో బ్రిటన్ ది టాప్ ప్లేస్. అమెరికా రెండో స్థానంలో ఉంది. కాగా, ఇండియన్స్ డిపాజిట్లు ఒక్క 2023లోనే దాదాపు 25 శాతం పడిపోయి రూ.63 కోట్లకు చేరాయి. కానీ, 2022లో 18 శాతం పెరగగా, 2021లో 8 శాతానికిపైగా పడిపోయాయి. 2007 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల విలువ రూ.9,000 కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరింది.