ఇటలీలో జరిగిన అరాచకం గురించి తెలిస్తే భారతీయుడి గుండె మండుతుంది
ఇటలీలో ఒక భారతీయుడికి జరిగిన అన్యాయం గురించి తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరి గుండె మండుతుంది.
By: Tupaki Desk | 27 Jun 2024 4:10 AM GMTపేరుకు సంపన్న దేశాలే కానీ.. మనసులో వారి బుద్ది ఎంత చిన్నగా ఉంటుందన్న విషయానికి సంబంధించి తాజాగా యూరోప్ లోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఇటలీలో చోటు చేసుకున్న ఒక అనాగరిక ఘటన షాకింగ్ గా మారింది. ఇప్పుడు ఆ దేశంలో భారీ నిరసనకు కారణం కావటమే కాదు.. దేశ ప్రధాని జార్జియా మెలోని తన సంతాపాన్ని వ్యక్తం చేయటమే కాదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నారు. ఇటలీలో ఒక భారతీయుడికి జరిగిన అన్యాయం గురించి తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరి గుండె మండుతుంది. మరీ.. ఇంత దుర్మార్గమా? అన్న భావన కలుగక మానదు.
ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేందుకు పలు దేశాల నుంచి వేలాది మంది అక్రమంగా వస్తుంటారు. అలా వచ్చినోళ్లలో ఒకడు పంజాబ్ కు చెందిన 31 ఏళ్ల సత్నామ్ సింగ్. భారత్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఇటలీకి వెళ్లిన అతడు ఒక వ్యవసాయ క్షేత్రంలో అనధికారికంగా పని చేస్తున్నాడు. అక్కడ ఎండుగడ్డిని కోసే సమయంలో అతడి చేయి తెగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్చి కాపాడాల్సిన ఆ వ్యవసాయ క్షేత్రం యజమాని అందుకు భిన్నంగా ఒక చెత్త బస్తాలో అతడ్ని ఉంచి.. రోడ్డు మీద పడేసి తమ దారిని తాము వెళ్లిపోయారు.
బాధితుడి భార్య.. స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పటంతో వారు స్పందించారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడ్ని ఎయిర్ అంబులెన్స్ లో (హెలికాఫ్టర్ )లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయం కావటం.. ఆలస్యంగా ఆసుపత్రికి చేరటంతో అతను చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన ఇటలీలో కొత్త నిరసనకు కారణమైంది.
ఈ ఘటనపై నిరసిస్తూ ఇటలీలో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్ల మీదకు వచ్చారు. ఇటలీలో ఈ తరహా బానిసత్వం అంతం కావాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. తాము పని చేయటానికే వచ్చామే తప్పించి చచ్చేందుకు కాదంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇటలీలో ఈ తరహా పని బానిసత్వం అంతం కావాలంటూ వారు కోరుతున్నారు. ఇటలీలో పని చేస్తున్న వారిని కుక్కల మాదిరి చూస్తుంటారని.. తమపై శ్రమదోపిడీ జరుగుతూనే ఉందని పలువురు భారతీయులు చెబుతున్నారు.
ఈ నిరసన తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రి మెలోని తాజాగా పార్లమెంట్ లో స్పందించారు. అమానవీయ చర్యకు సత్నామ్ సింగ్ బలయ్యారన్న ఆమె.. ఈ దారుణ చర్యలకు పాల్పడిన వారిని క్రూరులుగా ఆమె పేర్కొన్నారు. వారిని విడిచి పెట్టమని.. కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధితుడి మరణానికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ దారుణ ఉదంతంపై ఇటలీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సత్నామ్ సింగ్ కుటుంబానికి సహకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొంది. పేరుకు సంపన్న దేశాలే కానీ.. అక్కడి సంపన్నుల మనసులు మాత్రం బండరాయిలుగా ఉంటాయన్న విషయం మరోసారి నిరూపితమైందని చెప్పాలి.