షాకింగ్ న్యూస్... 403 మంది భారతీయ విద్యార్థులు మృతి!
ఇటీవల కాలంలో వరుసగా విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 8 Dec 2023 11:16 AM GMTఇటీవల కాలంలో వరుసగా విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాల్పుల ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, జాత్యహంకార హత్యలు, మగ్గింగ్ నేరలు... కారణం ఏదైనా, కారణం ఎవరైనా ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు మృతువాత పడుతున్నారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవును... తాజాగా వెలువడిన ఒక నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాధాలు, ఇతర కారణాలతో సుమారు 403 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు నిర్ధారించబడింది. 2018-23 మధ్య కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక ప్రకటన వెల్లడించింది.
ఇదే సమయంలో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే... కెనడా, యూకే, యూఎస్ లలో ఈ మరణాలలో ఎక్కువ ఉండటం. వాస్తవానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా యూఎస్ లోనే ఎక్కువగా మృత్యువాతపడుతున్నారని అనిపించినా... కెనడాలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తుంది!
ఈ క్రమంలో గత ఐదేళ్లలో 34 దేశాల్లో సుమారు 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. ఇందులో ప్రధానంగా ఒక్క కెనడాలోనే సుమారు 91 మంది విద్యార్థులు మరణించగా.. యూకే లో 48 మంది మరణించారు. ఇదే క్రమంలో రష్యాలో 40 మంది మరణించగా.. భారతీయ విద్యార్థులు అధికంగా ఉన్నారని చెప్పే యూఎస్ లో 36 మంది మరణించారు.
ఇదే క్రమంలో ఆస్ట్రేలియాలో 35 మంది మరణించగా, ఉక్రెయిన్ లో 21, జర్మనీలో 20, సైప్రస్ లో 14, ఫిలిప్పియన్స్ లో 10 మంది భారతీయ విద్యార్థులు మరణించారు.
ఈ ఘణాంకాల ప్రకారం గతకొంతకాలంగా భారత్ - కెనడాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల మధ్య.. కెనడాలో అత్యధికంగా విద్యార్థుల మరణాలు చోటుచేసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ క్రమంలో తాజాగా రాజ్యసభలో ఇదే అంశంపై చర్చ జరిగింది. దీంతో భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని భారత్ ప్రతిజ్ఞ చేసింది.