Begin typing your search above and press return to search.

బంకర్లల్లో భారతీయులు...ఇజ్రాయేల్ లో మన స్టూడెంట్స్ అప్ డేట్స్!

పశ్చిమాసియాలో అత్యంత సున్నితమైన సరిహద్దుల్లో ఒకటైన ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి.

By:  Tupaki Desk   |   8 Oct 2023 8:29 AM GMT
బంకర్లల్లో భారతీయులు...ఇజ్రాయేల్ లో మన స్టూడెంట్స్ అప్ డేట్స్!
X

పశ్చిమాసియాలో అత్యంత సున్నితమైన సరిహద్దుల్లో ఒకటైన ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్‌ పై పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మెరుపు దాడులకు దిగింది. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఇజ్రాయెల్‌ పై హమాస్‌ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్‌ పట్టణాలు, నగరాల్లో సుమారు 22 చోట్ల మిలిటెంట్లకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి భీకర పోరు సాగుతోంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం తాజాగా ఇజ్రాయెల్‌ లో మరణాల సంఖ్య 300 దాటగా.. గాయపడినవారి సంఖ్య 1500 మందికిపైగా ఉందని తెలుస్తుంది. ఇక గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో... మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయేల్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హమాస్ దాడిని అత్యంత పగడ్భందీగా ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 232 మంది మరణించగా 1,697 మంది గాయపడ్డారు.

ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి దీనిద్వారా మరో తలనొప్పి వచ్చి పడినట్లయిందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ పై దాడిని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ఖండించారు. భారత్ ప్రధాని ఇజ్రాయేల్ కు తమ సంఘీభావం ప్రకటించారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ యుద్ధంలో పలువురు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని తెలుస్తుంది. ఉన్నత చదువుల కోసం ఇజ్రాయెల్‌ కు వెళ్లిన చాలా మంది భారతీయ విద్యార్థులు ఈ ఊహించని పరిణామానికి ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అనుకోని విధంగా యుద్ధం ఆరంభం కావడంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారట.

అవును... హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు బయటికి రాలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారని ఆన్ లైన్ వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వారి పరిస్థితిని తెలిపరుస్తున్నారు.

ఇలా సెల్ఫీ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న భారతీయ విద్యార్థులు అక్కడ తమ పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం పోలీసులు, మిలటరీ బలగాలూ అక్కడ మొహరించాయని, మరోపక్క తాము ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఉదయం 5.30కే దాడులు ప్రారంభమవడంతో సైరన్లు మోగాయని.. తాము బంకర్లలో తలదాచుకున్నామని చెబుతున్నారు.

కాగా... ఈ తెల్లవారుజామునే "ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌" ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. ఈ మేరకు అతడు ఒక వీడియో సందేశం పంపాడు. ఇక్కడ "ఆల్-అఖ్సా" అనేది మసీదు పేరు! జెరుసలేంలోని "అల్‌ అఖ్సా" మసీదు ఇస్లాంలోనే మూడో అత్యంత పవిత్ర స్థలం కాగా... అక్కడే యూదుల పవిత్ర స్థలం ఉంది.

మరోపక్క హమాస్‌ ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ "ఐరన్‌ స్వార్డ్స్‌" ను ప్రారంభించింది. గాజాలోని హమాస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు అవిరామంగా దాడులు చేస్తున్నాయి. గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో కూల్చి వేస్తోంది. ఇందులో భాగంగా... హమాస్‌ కార్యాలయాలతోపాటు 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది.