యూఎస్ రిటన్ ఫ్లైట్ ఎక్కిచేస్తోంది... ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థుల ఎఫ్-1 వీసా, బోర్డింగ్ పాస్ లాంటి వాటిని ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తారు
By: Tupaki Desk | 19 Aug 2023 8:09 AM GMTతప్పుడు ధ్రువపత్రాలున్న వారిని నిరోధించే క్రమంలో అమెరికా అధికారులు తాజాగా ఒకేసారి 21 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపినట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే కాదు... ఈ సంవత్సరం ఇప్పటికే 500 మంది భారతీయులు వచ్చి ఉంటారని అంటున్నారు.
అవును... తాజాగా వెనక్కి వచ్చారని చెబుతోన్న 21 మందే కాకుండా, ఈ ఏడాది మొత్తంలో సుమారు 500 మంది వరకూ భారతీయులు వెనక్కి వచ్చారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం తప్పుడు దృవీకరణ పత్రాల సమర్పణ ఒకటి కాగా... అవి తప్పుడువి అని కన్సలెంట్స్ కొంతమంది చెప్పకపోవడం మరో కారణం అని అంటున్నారు!
ఈ సమయంలో యూఎస్ వెళ్లాలనుకుంటున్నవారు కచ్చితంగా తీసుకోవల్సిన కొన్ని జాగ్రత్తలను నిపుణులు, ఎన్నారైలు, ఎన్నారై సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు! ఈ విషయంలో కొన్ని మెలుకువలు పాటిస్తే... ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెబుతున్నారు. ఇందులో భాగంగా... కొన్ని సలహాలూ సూచనలు ఇస్తున్నారు.
విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థుల ఎఫ్-1 వీసా, బోర్డింగ్ పాస్ లాంటి వాటిని ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తారు. ఇది సాధారణ ప్రక్రియ. ఈ సమయంలో అందర్నీ కాకపోయినా అప్పుడప్పుడు కొందరు విద్యార్థులను ఇమిగ్రేషన్ అధికారులు కొన్ని క్యాజువల్ క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి కూడా కొందరు ఇంగ్లిష్ లో సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారని అమెరికన్ కాన్సులేట్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో వెనక్కి పంపుతున్న వారిలో సగం మంది కనీస ఆంగ్ల పరిజ్ఞానం లేని వారేనని అంటున్నారు. ఆంగ్లంలో సమాధానాలు చెప్పలేకపోతే.. జీ.ఆర్.ఈ, టోఫెల్ స్కోర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. సో... అమెరికా వెళ్లాలనే ఆత్రుతతో పాటు ఆంగ్లం మీద పట్టు సాధించడం కూడా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు.
ఇదే క్రమంలో తమకు అనుమానం వచ్చినవారిని లేదా కొందరినైనా ప్రశ్నించేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఛాటింగ్ లను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారని చెబుతున్నారు. దీంతో వాట్సప్ లో చేసిన ఛాటింగ్ లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఈ-మెయిళ్లు ఇప్పుడు వందల మంది విద్యార్థులకు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధంగా మారుతున్నాయని తెలుస్తోంది.
ఉదాహరణకు అమెరికాలో దిగగానే పార్ట్ టైమ్ ఉద్యోగం చేయవచ్చా? అక్కడ్ద పార్ట్ టైం జాబ్ దొరకాలంటే ఎన్ని రోజులు ఆగాలి? ఫీజులకు అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఏ విధంగా చూపించాలి? దానికోసం కన్సల్టెన్సీలకు ఎంత మొత్తం చెల్లించాలి? వంటి సంభాషణలు జరిపినట్లు ఉంటే.. అలాంటి వారిని వెనక్కి పంపడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
వీటితోపాటు అతిముఖ్యమైనది ధృవపత్రాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. "మేం సమర్పించే అన్ని ధ్రువపత్రాలు నిజమైనవేనని వీసా మంజూరు సమయంలో విద్యార్థులు ధ్రువీకరిస్తారు. వాటిలో తప్పుడు పత్రాలుంటే వారిని వెనక్కి పంపిస్తారు" అని అమెరికన్ కాన్సులేట్ అధికారులు చెబుతున్నారంటే... అది మనవారి అవగాహనా లోపం అవ్వొచ్చు.. లేదా, కన్సల్టెన్సీల లోపం కూడా అవ్వొచ్చని చెబుతున్నారు.
ఈ విషయంలో వీసా మంజూరు కోసం ఎలాంటి తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించకూడదని.. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగం చేయకూడదని.. అలాంటి వాటిపై ఛాటింగ్ లు చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. అంతకంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో విద్వేషపూరిత, రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టకూడదు.
ఇదే సమయంలో... ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బులు ఒకవేళ బ్యాంకు రుణం రూపంలో తీసుకుంటే.. ఆ పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా.. చదువుకునే వర్సిటీ, కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఐ-20 కోసం పూర్తిగా కన్సల్టెన్సీలపై ఆధారపడకుండా సొంతంగా వివరాలు నింపేలా ప్రయత్నించాలి.