Begin typing your search above and press return to search.

'అవిశ్వాసం' విషయంలో భారత ప్రధానుల చరిత్ర ఇది!

ఆ పరిస్థితుల్లో అయినా మోడీని మణిపూర్ ఘటనలపై స్పందింపచేయాలని వారి తాపత్రయం

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:08 AM GMT
అవిశ్వాసం విషయంలో భారత ప్రధానుల చరిత్ర ఇది!
X

మణిపుర్‌ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టుబడుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మోడీ ఏకంగా పార్లమెంటుకే రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో విపక్షాలు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

ఆ పరిస్థితుల్లో అయినా మోడీని మణిపూర్ ఘటనలపై స్పందింపచేయాలని వారి తాపత్రయం. దీంతో... విపక్షాలు ఇచ్చిన తీర్మానానికి స్పీకర్ అనుమతించారు. ఇందులో భాగంగా... ఆగస్టు 8 నుంచి చర్చ చేపడతామని వెల్లడించారు. ఈ అంశంపై చర్చ మూడు రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ క్రమంలో.. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు.. ఎంతమంది ప్రధానులు, ఎన్నెన్ని సార్లు, ఏయే సందర్భాల్లో అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...!

స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో ఇప్పటివరకూ ఎనిమిది మంది ప్రధానులు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. వీరిలో అత్యధిక సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న విషయంలో ఇందిరాగాంధీ రికార్డు నెలకొల్పగా... ఒక్కసారి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోలేని ప్రధానిగా మన్మోహన్ సింగ్ రికార్డ్ నెలకొల్పారు.

భారత తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ... ఏకధాటిగా 16 ఏళ్లు పాలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వాతంత్ర్యానంతరం 1963లో మొదటిసారిగా నెహ్రూ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. 1962లో చైనా యుద్ధంలో ఓటమి అనంతరం ప్రజా సోషలిస్ట్‌ పార్టీ నాయకుడు ఆచార్య జె.బి.కృపలానీ దీన్ని ప్రవేశపెట్టారు.

ఈ నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానంపై సుమారు 21 గంటల 33 నిమిషాలపాటు చర్చ జరిగింది. చివరకు జరిగిన ఓటింగ్‌ లో నెహ్రూకు 285 సభ్యుల మద్దతు లభించింది. ఇలా భారతదేశ చరిత్రలో జరిగిన తొలి అవిశ్వాసం వీగిపోయింది.

అనంతరం 1964లో రెండో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర ఎంపీ ఎన్‌.సీ ఛటర్జీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 24 గంటల 34 నిమిషాల పాటు జరిగిన చర్చ అనంతరం ఇది కూడా వీగిపోయింది. మొత్తంగా రెండేళ్లు పదవిలో ఉన్న ఎల్‌.బీ శాస్త్రి.. మూడుసార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు.

అనంతరం ఇందిరా గాంధీ తొలిదఫా పాలన (1966-77)లో 12 సార్లు, 1980-84 మధ్య కాలంలో మరో మూడుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇలా తన 16ఏళ్ల పాలనలో 15సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొన్న ఇందిరాగాంధీ.. అన్నింటిలోనూ బయటపడటం గమనార్హం.

అనంతరం కాంగ్రెస్ పాలనకు గ్యాప్ వచ్చి జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నిలిచారు. ఈయన ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత వైబీ చౌవాన్‌ 1979లో అవిశ్వాసం ప్రవేశపెట్టారు.

ఈ అవిశ్వాస తీర్మానంపై సుమారు తొమ్మిది గంటలపాటు చర్చ జరిగింది. అయితే.. తీర్మానంపై ఓటింగ్‌ కు ముందే మొరార్జీ దేశాయ్ తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం రాజకీయాలకూ స్వస్తి పలికారు. దేశ చరిత్రలో అవిశ్వాసం గెలిచిన తొలి సందర్భం ఇదే!

అనంతర కాలంలో రాజీవ్ గాంధీ ఒకసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. 1987 డిసెంబర్‌ లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంపై మాధవ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంలో రాజీవ్‌ ప్రభుత్వం విజయం సాధించింది.

అనంతరం తెలుగు రాష్ట్రాలకు చెందిన పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఈ సమయంలో 1999 జులైలో సీపీఐ నేత అజయ్‌ ముఖోపాధ్యాయ.. పీవీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆసక్తికరంగా జరిగిన ఆ ఓటింగ్ ప్రక్రియలో... 14 ఓట్లతో పీవీ ప్రభుత్వం గట్టెక్కింది.

1991-96 వరకు ఐదేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపిన పీవీఎన్‌ రావు.. మొత్తంగా మూడుసార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న చివరి కాంగ్రెస్‌ ప్రభుత్వం పీవీ నరసింహారావుదే కావడం గమనార్హం. పీవీ తర్వాత కాంగ్రెస్ ప్రధానికి ఈ పరిస్థితి రాలేదు!

అనంతరం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో 2003 ఆగస్టులో వాజపేయి ప్రభుత్వంపై అప్పటి విపక్ష నేత సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సుమారు 21గంటలపాటు చర్చ జరిగింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయింది.

వాజపేయి తర్వాత ఎన్డీయే ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ఈ సమయంలో 2018లో మోడీ తొలిసారి అవిశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే ఆ తీర్మానం కూడా వీగిపోయింది. అనంతరం తాజాగా ఈ ఏడాది ఆగస్టు 8 - 10 మధ్యకాలంలో మోడీ మరోసారి అవిశ్వాస తీర్మానంపై చర్చకు, అనంతరం ఓటింగ్ కు సిద్ధమవుతున్నారు.

కాగా... స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 27సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు జరిగేది 28వ అవిశ్వాస తీర్మానం కాగా... మోడీకి రెండోది.