సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు అంత జరుగుతోందట
దీనికి సంబంధించిన చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నా.. మోసగాళ్లకు చిక్కుకుంటున్న బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
By: Tupaki Desk | 16 March 2025 10:01 AM ISTఎదుటివారి ఆశను సొమ్ము చేసుకోవటం.. బలహీనతలతో దోచుకోవటం సైబర్ నేరగాళ్లకు ఎంత అలవాటన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తమ రూటు మార్చుకుంటూ.. అమాయకుల్ని నిలువునా ముంచేస్తున్న ఈ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర హోం శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నా.. మోసగాళ్లకు చిక్కుకుంటున్న బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీనికి కారణం.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడల్ని ఫాలో కావటమే.
డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల్ని దారుణంగా మోసం చేసే వారి సిమ్ కార్డుల్ని.. స్కైప్ ఐడీలను .. వాట్సప్ నంబర్లను బ్లాక్ చేస్తున్నా.. నేరాలు మాత్రం తగ్గట్లేదు. తాజాగా సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకుతీసుకున్న చర్యల గురించి రాజ్యసభలో సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
సైబర్ నేరాల కోసం వినియోగిస్తున్న 2.08 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేశామని.. డిజిటల్ స్కామ్ లకు ఉపయోగించిన 7.81 లక్షల సిమ్ కార్డుల్ని బ్లాక్ చేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో పరిష్కరించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పెద్ద ఎత్తున పని చేస్తున్నట్లు చెప్పారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు ఏడెనిమిది సార్లు విధిగా ప్రతి వినియోగదారుడికి సైబర్ నేరాల మీద అవగాహన కలుగజేసేలా కాలర్ ట్యూర్ ప్రచారాన్ని చేపట్టినట్లుగా చెప్పారు.
ఏదైనా సైబర్ నేరం జరిగినంతనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ స్కామ్ ల కోసం ఉపయోగించే 3963 స్కైప్ ఐడీలు.. 83,668 వాట్సాప్ ఖాతాల్ని గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టినట్లుగా వెల్లడించారు. వివిధ సైబర్ నేరాలపై వచ్చిన 13.36 లక్షల కంప్లైంట్ల ఆధారంగా రూ.4386 కోట్ల మొత్తాన్ని నేరగాళ్లబారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంతగా పని చేస్తున్నా.. సైబర్ నేరగాళ్లు అంతే ఎక్కువగా మోసాలు చేస్తున్న వైనం చూస్తే.. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.