Begin typing your search above and press return to search.

‘బంగ్లా’ ప్రధానిగా భారత్‌ స్నేహితురాలు!

భారత్‌ కు మంచి మిత్రురాలిగా ఉన్న షేక్‌ హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:02 AM GMT
‘బంగ్లా’ ప్రధానిగా భారత్‌ స్నేహితురాలు!
X

బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా (76) వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తం మీద అయిదోసారి ఆమె పార్టీ అవామీలీగ్‌ అధికారంలోకి వచ్చింది. జనవరి 7న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీలీగ్‌ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. భారత్‌ కు మంచి మిత్రురాలిగా ఉన్న షేక్‌ హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.

బంగ్లాదేశ్‌ లో మొత్తం 300 ఎంపీ సీట్లకుగానూ 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. మొత్తం 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు.

జనవరి 7న అర్ధరాత్రి వరకూ కొనసాగిన ఎన్నికల లెక్కింపులో అవామీ లీగ్‌ 200 స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రధాని షేక్‌ హసీనా గోపాల్‌ గంజ్‌–3 స్థానం నుంచి వరుసగా 8వ సారి అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 249,965 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్‌ సుప్రీం పార్టీ అభ్యర్థి నిజాముద్దీన్‌ లష్కర్‌ కు కేవలం 469 ఓట్లు మాత్రమే పడ్డాయి.

కాగా బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జనవరి 8 ఉదయానికి పూర్తి స్థాయిలో వెలువడనున్నాయి. ఈసారి ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) సహా 15 ఇతర పార్టీలు సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాయి.

అధికార అవామీ లీగ్‌ అభ్యర్థులు, స్వతంత్రులు మినహా ఇతర ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించడానికి ఆసక్తి చూపలేదు. ప్రతిపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య 40 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. ఆ ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 40 శాతానికి పడిపోయింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ–జమాత్‌–ఇ–ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని మండిపడ్డారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించామని తెలిపారు. భారత్‌ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని వెల్లడించారు. భారత్‌ లాంటి దేశం పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమన్నారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్‌ ఎంతగానో సహకరించిందని ఈ సందర్భంగా హసీనా గుర్తు చేశారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని ఆ విషాదాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో భారత్‌ తనకు ఆశ్రయం కల్పించి ఆదుకుందని చెప్పారు.