ఇండియాలోనే అత్యంత ఎత్తైన టవర్ @ బెంగళూరు... ప్రత్యేకతలివే!
అవును... బెంగళూరు కోసం ఒక విజన్ స్కైడెక్ ప్రాజెక్ట్ ను తాజాగా ముందుకు తెచ్చారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన వ్యూయింగ్ టవర్ గా అవతరిస్తుందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 21 Oct 2023 1:30 AM GMTకర్ణాటక పేరు చెప్పగానే ముందుగా ఐటీ సెక్టార్ గుర్తుకు వస్తే... దానికి అనుగుణంగానే ట్రాఫిక్ కూడా గుర్తుకు వస్తుందనడంలో సందేహం ఉండకపోవచ్చు. దీంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా... ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ట్రాఫిక్ కష్టాలను తగ్గించే లక్ష్యంతో టన్నెల్ నెట్ వర్క్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇదే నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు.
అవును... బెంగళూరు కోసం ఒక విజన్ స్కైడెక్ ప్రాజెక్ట్ ను తాజాగా ముందుకు తెచ్చారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన వ్యూయింగ్ టవర్ గా అవతరిస్తుందని చెబుతున్నారు. ఆస్ట్రియన్ ఆర్కిటెక్చర్ కంపెనీ కూప్ హిమ్మెల్బ్, వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందని బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్న శివకుమార్ వెల్లడించారు.
ఇదే సమయంలో... ప్రాజెక్ట్ సమగ్ర ఆర్థిక అంచనాను నిర్వహించాలని, దాని నిర్మాణానికి అనువైన సుమారు 8-10 ఎకరాల భూమిని గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్కైడెక్ ప్రాజెక్ట్ ఒక మర్రి చెట్టు ఆకారాన్ని పోలిన నిర్మాణంగా ఉండబోతోందని.. దీని ఎత్తు సుమారు 250 మీటర్లు ఉంటుందని అంటున్నారు. తాజాగా ఈ విషయాలను తన ఎక్స్ (ట్విట్టర్) లో పేర్కొన్నారు శివకుమారు.
ఇందులో భాగంగా... శివకుమార్ ప్రాజెక్ట్ సంభావిత వీడియోను పంచుకున్నారు. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ సహకారంతో ఆస్ట్రియాకు చెందిన కూప్ హిమ్మెల్బ్ ద్వారా రూపొందించబడిన ప్రతిపాదిత బెంగళూరు స్కైడెక్ ప్రాజెక్ట్ ప్లాన్ ను సమీక్షించారు. ఇది అమలు చేస్తే దేశంలోనే ఎత్తైన వీక్షణ టవర్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. 2.11 నిమిషాల ఈ వీడియో క్లిప్ పగటిపూట, రాత్రిపూట సెట్టింగులలో మహోన్నత నిర్మాణాన్ని చూపిస్తుంది, వీక్షకుల ఊహలను బంధిస్తుంది.
అయితే శివకుమార్ ఈ మేరకు ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయగానే... దాదాపు ప్రతీ ఒక్కారు ఈ ప్రాజెక్ట్ పై స్పందిస్తూనే ట్రాఫిక్ పై కామెంట్ చేయడం గమనార్హం. "ప్రాజెక్ట్ బాగుంది కానీ... ప్రస్తుతం బెంగళూరు బర్నింగ్ టాపిక్ ట్రాఫిక్" అని కొంతమంది కామెంట్ చేశారు. ఇదే సమయంలో... ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చుతో ట్రాఫిక్ సమస్యలు ఏమైనా పరిష్కరించొచ్చేమో ఆలోచించండి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు!