Begin typing your search above and press return to search.

ఇజ్రాయేల్ కు మోడీ సంఘీభావం... .ప్రపంచ నేతలు స్పందన ఇది!

అవును... ఇజ్రాయేల్ పై పాలస్తీనా చేసిన మెరుపు దాడిపై ప్రధాని మోడీ స్పందించారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 3:51 PM GMT
ఇజ్రాయేల్  కు మోడీ సంఘీభావం... .ప్రపంచ నేతలు స్పందన ఇది!
X

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌ పైకి పాలస్తీనాకు చెందిన వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. ఇదే సమయంలో పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు చొరబాటుకు దిగుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిదాడికి దిగింది. తమకున్న అత్యాధునిక పరిజ్ఞానంతో పాలస్తీనాను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడులపై పాలస్తీనాతో పాటు ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా ఇజ్రాయేల్ కు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

అవును... ఇజ్రాయేల్ పై పాలస్తీనా చేసిన మెరుపు దాడిపై ప్రధాని మోడీ స్పందించారు. ఇందులో భాగంగా... గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయేల్ లోకి భారీగా ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించిన వార్తవిని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారత్, ఇజ్రాయేల్ కు అండగా నిలబడుతుందని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మరోపక్క ఈ విషయంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా తాజా ఘర్షణలపై తన తొలి ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్‌ కు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునే హక్కు పాలస్తీనియన్లకు ఉందని.. ఇజ్రాయెల్ తో పాటు అక్కడ స్థిరపడిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునే హక్కు ఉందని తెలిపారు.

మరోపక్క ఇజ్రాయెల్‌ పై పాలస్తీనీయులు చేస్తున్న దాడికి ఇరాన్ మద్దతు ఇస్తుందని ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సలహాదారు ప్రకటించారు. ఇదే సమయంలో... ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల్లో ఇరు దేశాలూ సంయమనం పాటించాలని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో ఇజ్రాయేల్ పై పాలస్తీనా దాడిని యూరోపియన్ నేతలు ఖండించారు. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్‌ కు తమ సంఘీభావం ఉంటుందని ప్రకటించారు. ఇదే క్రమంలో... ఇజ్రాయెల్‌ పై పాలస్తీనా చేసిన దాడులను "ఉగ్రవాద దాడి"గా అభివర్ణించారు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్!

కాగా... శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ పై పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. జెరూసలెం సహా దేశవ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేల కొలదీ రాకెట్లను ప్రయోగించారని తెలుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి.

ఈ చర్య అనంతరం కొద్ది సేపటి తర్వాత ఇజ్రాయేల్ దీనిపై ఒక ప్రకటన చేసింది. తమ భూభాగాల్లోకి పాలస్తీనా మిలిటెంట్లు చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. దీంతో... సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో... భారత్ ప్రధాని మోడీ, ఇజ్రాయేల్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.