ఇదీ భారత్ దెబ్బ అంటే.. పాకిస్థాన్ కు మరో చావుదెబ్బ!
ఇన్నాళ్లూ సింధూ నది, రావి నది జలాల్లో అత్యధికం పాకిస్థాన్ వాడుకుంటుండగా ఇక నుంచి ఈ జలాలను పూర్తిగా భారతే వాడుకోనుంది.
By: Tupaki Desk | 26 Feb 2024 9:48 AM GMTసరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు, ఆయుధాలు అందిస్తూ భారత్ లో అశాంతిని ఎగదోస్తున్న శత్రు దేశం పాకిస్థాన్ ను భారత్ గట్టి దెబ్బతీసింది. ఇదేమీ సైనిక ఆపరేషనో, మరొకటో కాదు. పాకిస్థాన్ ను ఎక్కడ కొట్టాలో అక్కడే భారత్ కొట్టింది.
ఇన్నాళ్లూ సింధూ నది, రావి నది జలాల్లో అత్యధికం పాకిస్థాన్ వాడుకుంటుండగా ఇక నుంచి ఈ జలాలను పూర్తిగా భారతే వాడుకోనుంది. స్వాతంత్య్రం వచ్చాక రెండు దేశాలు విడిపోయాక.. నాలుగున్నర దశాబ్దాల నుంచి సింధు, రావి జలాల్లో అత్యధికం పాకిస్థానే వాడుకుంటోంది. ఇప్పుడు రావి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్ కు నీటి ప్రవాహన్ని భారత్ పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
1960లో భారత్, పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్ కు లభించాయి. రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు దక్కాయి. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఇరు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. రావి నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్ కు లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్థాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం 1979లో పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.
రావి నదిపై ఎగువవైపు రంజిత్ సాగర్ డ్యామ్, కిందివైపు షాపుర్ కంది బ్యారేజ్‌ను నిర్మించేందుకు అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం షేక్ మహమ్మద్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అంగీకరించారు. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దీంతో 1982లో అప్పట భారత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు 1998 నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం జరిగింది.
ఎట్టకేలకు 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. అయితే షాపుర్ కంది బ్యారేజ్ ఆగిపోయింది. అయితే పాకిస్థాన్ కు నీటి ప్రవాహం మాత్రం ఆగలేదు. 2008లో దీన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2013లో నిర్మాణం మొదలుపెట్టారు.
అయితే పంజాబ్, జమ్మూకశ్మీర్ మధ్య విభేదాలతో సంవత్సరానికే ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలను ఒప్పించడంతో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. చివరకు ఫిబ్రవరి 25 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. దీంతో రావి నది నుంచి పాకిస్థాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు.
పాకిస్థాన్ కు ఆపేసిన నీటిని జమ్మూకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు అందిస్తారు. దీని వల్ల 32 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 20 శాతాన్ని జమ్మూకశ్మీర్‌కు అందిస్తారు. జమ్ముకాశ్మీర్ కే కాకుండా పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకూ రావి జలాలు ఉపయోగపడతాయి.