ఇండియన్ రోడ్స్ పై టెస్లా కార్లు రయ్ రయ్... ముహూర్తం ఫిక్స్!
అవును... 2024 జనవరి నుంచి ఇండియాలో టెస్లా కార్లు ఎంటరవ్వబోతున్నాయని తెలుస్తుంది
By: Tupaki Desk | 7 Nov 2023 4:47 PM GMTభారతీయులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు ఎలాన్ మక్స్! ఇందులో భాగంగా త్వరలో తన టెస్లా కార్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించడం ఈ సందర్భంగా మస్క్ కు భారత్ విషయంలో కలిసివస్తుందని చెబుతున్నారు!
అవును... 2024 జనవరి నుంచి ఇండియాలో టెస్లా కార్లు ఎంటరవ్వబోతున్నాయని తెలుస్తుంది. దీనికోసం అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని ఇండియన్ గవర్నమెంట్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు, ఇటీవల ప్రధాని కార్యాలయం నిర్వహించిన సమావేశంలో వీటిపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టెస్లాతో పాటు ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని అంటున్నారు.
వాస్తవానికి గతంలోనే టెస్లా భారత్ లో అడుగుపెట్టబొతుందంటూ కథనాలొచ్చాయి. అప్పట్లో రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమయంలో పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్ ఉండేలా అడిగింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. అయితే.. దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో ఆ ప్రవేశం నాడు పోస్ట్ పోన్ అయ్యింది.
ఈ సమయంలో స్థానిక తయారీ యూనిట్ భారత్ లో స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ఈ సందర్హంగా భారత్ లో ఉన్న కస్టమ్స్ డ్యూటీ రాయితీల గురించి, ఇక్కడ తయారీదారులకున్న ప్రత్యక్ష రాయితీలను వివరించింది! ఈ క్రమంలో... వచ్చే ఏడాది జనవరిలో ఎంట్రీకి సిద్ధపడబోతున్నారని తెలుస్తుంది.
ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం సమానంగా పరిగణిస్తారు. ఇదే సమయంలో దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి దిగుమతులపై భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించే విధంగా.. పర్యావరణ అనుకూల వాహనాలపై మాత్రం కాస్త తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.
అలా అని ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాదని.. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీలకూ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఎలక్ట్రిక్ వాహనల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతానికి ఈ సడలించిన నిబంధనలో, కొత్త దిగుమతి పాలసీనో.. మస్క్ కు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాయనే భావించాలి. ఫలితంగా... వచ్చే ఏడాది భారత్ రోడ్లపై టెస్లా కార్లు రయ్ రయ్ మనబోతున్నాయని అంటున్నారు!
కాగా... జూన్ లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, భారీ పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్ కు తీసుకొచ్చే పనిలో ఉన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.