ఇండియా టుడే సీఎం సర్వే... రేవంత్ కు 21, కేసీఆర్ కు 33!
హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరికొన్ని గంటల్లో (ఆదివారం ఉదయం 8 గంటల నుంచి) వెలువడనున్నాయి.
By: Tupaki Desk | 2 Dec 2023 7:37 AM GMTహోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరికొన్ని గంటల్లో (ఆదివారం ఉదయం 8 గంటల నుంచి) వెలువడనున్నాయి. ఈలోపు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అంటూ ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే సర్వే ఒకటి జరిగింది. దాని ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి.
అవును... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు వెల్లడించిన నేపథ్యంలో... ఆ పార్టీ శ్రేణులు సంబరాలు స్టార్ట్ చేసేశారని అంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఏవరు అనేది అత్యంత ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఇప్పటికే సీఎం సీటు కోసం 12 మంది నాయకులు పోటీ పడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి తర్వాత కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ... కాంగ్రెస్ పార్టీ ఈసారి భట్టి విక్రమార్కకు అవకాశం ఇవ్వాలనే చర్చ బలంగా నడుస్తుంది. ఈ సమయంలో... “ఇండియా టుడే” ఈ విషయంపై సర్వే చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయంపై జనాల్లోకి వెళ్లింది.
ఈ ప్రశ్నకు సమాధానంగా సుమారు 21 శాతం మంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో సుమారు 22 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా తమకు బాగానే ఉంటుందని చెప్పడం గమనార్హం. దీంతో... సీఎం అభ్యర్థి అనేది ప్రజల సమస్య కాదు.. కేవలం నేతల మధ్య నానుతున్న సమస్య మాత్రమే అనే కన్ క్లూజన్ కి వస్తున్నారు పరిశీలకులు.
ఇదే సమయంలో బీఆరెస్స్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న ఇండియా టుడే ప్రశ్నకు కూడా దాదాపు చాలా మంది ఊహించిన సమాధానమే వచ్చింది! ఇందులో భాగంగా బీఆరెస్స్ నుంచి సీఎంగా కేసీఆర్ కు అనుకూలంగా 33 శాతం మంది ప్రజలు తీర్పు ఇవ్వగా.. 15 శాతం మంది కేటీఆర్ కు జైకొట్టారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి! ఇదే సమయంలో మరో 10 శాతం మంది ప్రజలు ఎవరైనా ఓకే అన్నట్టుగా చెప్పుకొచ్చారు!
ఏది ఏమైనా... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిని ఫైనల్ చేయడం అనేది అత్యంత కీలకమైన పరిణామం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య పోటీ ఉండొచ్చని అంటున్నారు. రేవంత్ మాత్రం సుమారు 12 మంది ఆ సీటుకోసం పోటీ పడుతున్నారని చెబుతున్నారు!