ఆరుగురే ఉన్నారని ఫ్లైట్ నుంచి దించేసిన ఇండిగో
అమృత్‌సర్ నుంచి చెన్నైకు వెళ్లాల్సిన విమానం వయా బెంగళూరు మీదకు వెళుతుంది. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళకు కెంపెగౌడ ఎయిర పోర్టుకు ఇండిగో విమానం చేరుకుంది.
By: Tupaki Desk | 22 Nov 2023 4:45 AM GMTఅనుకున్నంతగా ప్రేక్షకులు సినిమాకు రాకుంటే.. సినిమా థియేటర్ వారు చెప్పా పెట్టకుండా షో క్యాన్సిల్ చేయటం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ.. ఇలాంటి పనిని పేరున్నఇండిగో లాంటి విమానయాన సిబ్బంది చేసిన వైనం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తాజాగా వారు చేసిన ఈ ఘనకార్యం ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. దీని గురించి తెలిసిన వారంతా తిట్టిపోస్తుననారు. చెన్నైకు వెళ్లాల్సిన ఫ్లైట్ లో ఆరుగురే ప్రయాణికులు ఉన్నారన్న కారణంగా.. వారిని బలవంతంగా దించేసిన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ఇండిగో సిబ్బంది చేసిన ఈ అతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చెన్నైకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఇద్దరు పెద్దవయస్కులతో సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురితో ట్రిప్ ఎందుకు వేయాలని భావించిన ఇండిగో సిబ్బంది.. ప్రయాణికులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. వారిని బలవంతంగా విమానం నుంచి దింపేసిన తీరుతో వారు రాత్రంతా విమానాశ్రయంలో వెయిట్ చేయాల్సిన దుస్థితి. కనీసం.. హోటల్ బస కూడా ఏర్పాటు చేయని వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనను ఇండిగో వర్గాలు సైతం ధ్రువీకరించాయి.
అమృత్‌సర్ నుంచి చెన్నైకు వెళ్లాల్సిన విమానం వయా బెంగళూరు మీదకు వెళుతుంది. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళకు కెంపెగౌడ ఎయిర పోర్టుకు ఇండిగో విమానం చేరుకుంది. బెంగళూరుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు దిగిపోగా.. చివరకు విమానంలో చెన్నైకు వెళ్లాల్సిన ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ ప్రయాణికుల వద్దకు వచ్చిన సిబ్బంది ఒక్కొక్కరిని ఒక్కోలా మాటలు చెప్పి విమానం నుంచి దించేయటం గమనార్హం.
విమాన సిబ్బంది తన వద్దకు వచ్చి.. విమానం దిగాలని.. తన కోసం మరో విమానం సిద్దంగా ఉన్నట్లు చెప్పటంతో తాను కిందకు దిగానని.. తన మాదిరే మిగిలిన ఐదుగురికి అలాంటి కాల్స్ వచ్చినట్లుగా బాధిత ప్రయాణికుడు పేర్కొన్నాడు.దీంతో.. తాము కంగారుగా విమానం దిగినట్లు చెప్పారు. కిందకు దిగి ఎయిర్ పోర్టులోపలకు వచ్చిన తర్వాత కానీ అదంతా విమాన సిబ్బంది చేసిన మోసమన్న విషయాన్ని గుర్తించారు.
తాము మోసపోయిన విషయాన్ని గుర్తించి.. ఇండిగో సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. తమపట్ల అనుచితంగా వ్యవహరించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇండిగో అసిస్టెంట్ మేనేజర్లాయిడ్ పింటో తమ వద్దకు వచ్చారు కానీ.. తమ పట్ల కనీస సానుభూతి కూడా చూపలేదని.. వేరే విమానాల్లో ప్రయాణ ఏర్పాట్లు చేసినప్పటికీ.. అదంతా తర్వాతి రోజు ఉదయం కావటం గమనార్హం. రాత్రంతా వారు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కనీసం హోటల్ వసతి కల్పించకపోవటం చూస్తే.. ఇండిగో వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టేలా మారింది. మోసం చేసిన ఇండిగో సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్న విషయాన్ని వెల్లడించకపోవటం గమనార్హం.