Begin typing your search above and press return to search.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు వచ్చిన సంగతీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2024 10:03 AM GMT
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!
X

దేశంలో ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలోని సుమారు అన్ని పాఠశాలలకూ ఒకేసారి ఇలాంటి ఫోన్ కాల్స్ రావడం తెలిసిందే. ఇదే క్రమంలో ప్రముఖుల నివాసాలు, విమనాశ్రయాలు మొదలైన చోట్ల ఈ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోతున్నాయి.

ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు వచ్చిన సంగతీ తెలిసిందే. ఇక విమానాలకైతే ఇటీవల కాలంలో వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. ఇండిగో విమానానికి శనివారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో తీవ్ర కలకలం మొదలైంది.

అవును... శనివారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు సుమారు 172 మంది ప్రయాణికులు, సిబ్బందితో 6ఈ 5314 ఇండిగో విమానం చెన్నై నుంచి ముంబై కి బయల్దేరింది. ఈ క్రమంలో టెకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సమయంలో అనూహ్యంగా.. ఆ విమానంలో ఓ రిమోట్ సైతం లభ్యమైంది.

దీంతో వెంటనే అలర్ట్ అయిన పైలట్లు ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం అందించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రిక్వస్ట్ చేశారు. అనుమతి దొరకడంతో... విమానం ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యే సమయానికి అక్కడ అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్సులతో సిద్ధంగా ఉన్నారు. విమానం ల్యాండ్ అవ్వగానే ప్రయాణికులందరినీ క్షేమంగా దించేశారు.

అనంతరం బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ఈ సమయంలో విమానాన్ని టెర్మినల్ ప్రాంతంలో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. కాగా... వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి ఇలా బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఇందులో భాగంగా... మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 5 గంటలకు టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూం లో ఓ టిష్యూ పై "బాంబు" అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రయాణికులందరినీ దించేసిన సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అది నకిలీ బెదిరింపని తెలిపారు!