ప్రయాణికులను వణికించిన ఇండిగో... టూమచ్ నిర్లక్ష్యం గురూ
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న విమానయాన సంస్థల నిర్లక్ష్యాలు.. విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి
By: Tupaki Desk | 15 April 2024 11:12 AM GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న విమానయాన సంస్థల నిర్లక్ష్యాలు.. విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి! గాల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను టెన్షన లో పెట్టేస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా ఇండిగో విమానం ప్రయాణికులను వణికించేసిందని తెలుస్తోంది! కేవలం 1 - 2 నిమిషాలకు సరిపడా ఇందనం మాత్రమే ఉన్న సమయంలో ల్యాండింగ్ అవ్వడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!
అవును... వాతావరణం సహకరించకపోవడంతో అయోధ్య నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానాన్ని చండీగఢ్ కు మళ్లించారు. అయితే, అక్కడ ల్యాండింగ్ జరిగేటప్పుడు విమానంలో కేవలం రెండు నిమిషాలకు సరిపడా ఇంధనమే మిగిలి ఉందట. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రయాణికుడు జరిగిన మొత్తం వ్యవహారం ఇదంటూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు! ఇందులో భాగంగా... సాయంత్రం 3:25కు అయోధ్య నుంచి బయలుదేరిన విమానం 4:30 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా.. గమ్యస్థానానికి 15 నిమిషాల ముందు పైలట్ నుంచి ఓ ప్రకటన వచ్చిందని.. వాతావరణం సహకరించకపోవడంతో విమానం ల్యాండింగ్ క్లిష్టంగా మారిందని.. ఇంధనం అయిపోతోందని తెలిపారని రాసుకొచ్చారు.
ఈ సమయంలో ఆ ప్రకటన విమానంలో ఉన్న ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసిందని.. అయితే విమానం అక్కడక్కడే గాల్లో తిరుగుతూ రెండుసార్లు ల్యాండింగ్ కు యత్నించినా ఫలితం దక్కలేదని.. ఈ నేపథ్యంలో చివరకు చండీగఢ్ కు మళ్లించి, అక్కడ సురక్షితంగా దింపారని తెలిపారు. అయితే ఆ సమయానికి విమానంలో కేవలం 1-2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉండగా.. తామంతా ల్యాండ్ అయ్యామని వెల్లడించారు ఆ ప్రయాణికుడు!
ఈ విషయం ఇలా సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన అనంతరం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో.. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం అని, దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేయాలని మరో ప్రయాణికుడు డిమాండ్ చేశారు. అయితే... ఇంతజరిగినా కూడా సదరు విమానయాన సంస్థ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదని తెలుస్తుంది!