3500 కోట్ల నష్టానికి కారణమైన సినిమా!
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం... ఈ ఊహించని మలుపు ఇందిరా ఐవీఎప్ తాలూకా IPO ప్రణాళికలపై ప్రభావం చూపింది.
By: Tupaki Desk | 27 March 2025 6:30 PMఇటీవల కొంత కాలంగా ఇందిరా IVF పబ్లిక్ ఐపివో గురించి చర్చ సాగుతోంది. రూ. 3,500 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) వాయిదా పడేందుకు.. ఒక సినిమా పరాజయం కారణమైందని హిందీ మీడియాలో కథనాలొస్తున్నాయి. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న IVF రంగంలో అగ్రగామిగా ఉన్న సంతానోత్పత్తి క్లినిక్ చైన్ ఇందిరా ఐవిఎఫ్ సంస్థ నిర్మించిన `తుమ్కో మేరీ కసమ్` విడుదలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పరిమితుల్ని విధించింది. ఇందిరా ఐవీఎఫ్ వ్యవస్థాపకుడు అజయ్ ముర్దియా జీవితం ఆధారంగా రూపొందించిన ఈ బాలీవుడ్ బయోపిక ఆర్థిక మార్కెట్లపై ప్రభావం గురించి చర్చలకు దారితీసింది. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం... ఈ ఊహించని మలుపు ఇందిరా ఐవీఎప్ తాలూకా IPO ప్రణాళికలపై ప్రభావం చూపింది.
`తుమ్కో మేరీ కసం` రూ. 3,500 కోట్ల ప్రణాళికను పక్కదారి పట్టించిందని ఇప్పుడు టాక్ నడుస్తోంది. 2011లో ఉదయపూర్‌లో అజయ్ ముర్దియా స్థాపించిన ఇందిరా ఐవిఎఫ్ భారతదేశంలోని అత్యంత ప్రముఖ సంతానోత్పత్తి క్లినిక్ చైన్‌లలో ఒకటిగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 150 కి పైగా కేంద్రాలు , 330 మంది నిపుణులతో, కంపెనీ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) చికిత్సలకు పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుని ఎదుగుతోంది. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం ఈక్యూటీ మద్దతుతో 2023లో ఏటిఏ అసోసియేట్స్ , ముర్దియా కుటుంబం నుండి నియంత్రణ వాటాను కొనుగోలు చేసిన ఇందిరా ఐవీఎఫ్, దాని IPO ద్వారా రూ. 3,500 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మరింత విస్తరణకు ప్లాన్ చేసింది. కానీ దీనికి ఊహించని అడ్డంకి తలెత్తింది. ఈ ఐపీవో 2025లో అతిపెద్ద హెల్త్‌కేర్ లిస్టింగ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన `తుమ్కో మేరీ కసమ్` ఐపిఓ దాఖలు చేయడానికి కొన్ని రోజుల ముందు థియేటర్లలోకి వచ్చింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు మూడు గంటల నిడివితో ఉంది. ఈ చిత్రం అజయ్ ముర్దియా జీవిత ప్రయాణాన్ని తెరపై ప్రదర్శిస్తుంది. ఇందిరా ఐవీఎఫ్ దినదినాభివృద్ధిని తెరపరుస్తుంది. ఇందులో నాటకీయ కోర్టు రూమ్ దృశ్యాలు, స్పెషల్ ఎఫెక్ట్‌లు `ఇష్కా ఇష్కా`, `జరా పాస్ ఆనా` వంటి పాటలతో కూడిన ట్రాక్ లతో ఈ చిత్రం జనాల్ని ఆకర్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది.
విమర్శకులు ఈ సినిమాను విమర్శించగా, సెబీ ఆందోళనలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల సమయంపై సెబీ అభ్యంతరాలు లేవనెత్తింది. నిబంధనలను, న్యాయమైన మార్కెట్ పద్ధతుల ఉల్లంఘించిన సంస్థగా ఇందిరా ఐవీఎఫ్ కంపెనీని ఫ్లాగ్ చేసింది. `తుమ్కో మేరీ కసమ్` చిత్రం ఐపీవో ఊపందుకునేందుకు సహకరిస్తుందని, ఇది పరోక్ష ప్రచార సామగ్రిగా ఉపయోగపడుతుందని IPO ముందు పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేస్తుందని సెబీ అనుమానించింది. దీని ఫలితంగా ఇందిరా IVF డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను ఉపసంహరించారు. ఇది ఒక మైలురాయిని అందుకోవాల్సిన సమయంలో కంపెనీకి బిగ్ పంచ్ పడింది.
సెబీ అభ్యంతరం ఐపీవోలను ప్రభావితం చేసే అంశాలపై ఉంది. కంపెనీలు పబ్లిక్‌గా వెళ్లే ముందు ప్రజల అవగాహనను తారుమారు చేయకుండా నిరోధించడాన్ని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంలో సినిమా విడుదల సమయం - ఇందిరా IVF ఐపీవోకి వెళ్లే సమయం ఒకటేనని గుర్తించిన సెబీ కఠిన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి దాని ఐపీఓను పక్కన పెట్టడంతో, ఇందిరా ఐవీఎఫ్ ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడి, నియంత్రణాపరమైన సమస్యలను పరిష్కరించిన తర్వాత కంపెనీ సెబీకి తిరిగి దాఖలు చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా వృద్ధిని కొనసాగించడానికి ప్రైవేట్ నిధుల ఎంపికలను అన్వేషించవచ్చు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇందిరా ఐవీఎఫ్ స్థానాన్ని పటిష్టం చేయడానికి రూ. 3,500 కోట్ల ఐపీఓను ప్లాన్ చేసారు. కానీ సినిమా కారణంగా ఇది వాయిదా పడింది.