Begin typing your search above and press return to search.

మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు.. నియోజకవర్గానికి 3500

కొన్ని పథకాల్ని తలకెత్తుకోకపోవటమే మంచిది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 11:30 AM GMT
మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు.. నియోజకవర్గానికి 3500
X

కొన్ని పథకాల్ని తలకెత్తుకోకపోవటమే మంచిది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ చేసిన తప్పుల్నే.. రేవంత్ కూడా చేయటం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి తెలిసిందే. వేలాదిఇళ్లను భారీ ఎత్తున నిర్మించినప్పటికీ.. వాటిని లబ్థిదారులకు ఇచ్చే విషయంలో చోటుచేసుకున్న తల నొప్పుల కారణంగా.. నిర్మాణం పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా.. లబ్థిదారులకు అందించకుండా అలా ఉంచేశారు.

దీనికి కారణం.. ఉన్న ఇళ్లు కొన్ని అయితే.. లబ్థిదారులు బోలెడంత మంది. ఒకరికి ఇల్లు ఇస్తే.. తొమ్మిది మందికి ఇవ్వని పరిస్థితి అవుతుంది. ఒకరికి సానుకూలంగా ఉండే ఈ పరిణామం.. తొమ్మిది మందిని ప్రభుత్వానికి వ్యతిరేకించేలా చేస్తుంది. అందుకే.. వేలాది ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఉన్నా.. నేటికి ఇవ్వని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు వేలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లు.. ఎందుకు పనికి రాక.. నిరుపయోగంగా నిలిచిపోయిన దుస్థితి. ఈ కారణంగా హౌసింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం రేవంత్ మీద ఉందన్న మాట బలంగా వినిపించింది.

అయితే.. ఈ సూచనల్ని రేవంత్ సర్కారు పట్టించుకోలేదు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రకటించారు. అయితే.. దీపావళి అమావాస్య కావటంతో.. ఆ తర్వాత మంచి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలు.. కులాలు.. మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి బహు పేదల్ని ఎంపిక చేస్తామని చెప్పారు. అయితే.. ఇలాంటి ప్రకటనే గతంలో కేసీఆర్ చేశారు. కానీ.. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు.

దీనికి కారణం.. పథకాన్ని ప్రారంభంలో ఉండే ఉత్సాహం.. పంపిణీ వద్దకు వచ్చేసరికి సంక్లిష్టత చోటుచేసుకుంటుంది. దీంతో.. లబ్థిదారుల ఎంపిక తలనొప్పిగా మారి.. స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతో పంపిణీని ఆపేయటం జరుగుతుంది. గత ప్రభుత్వంలోనూ అదే జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ చేసిన తప్పునే రేవంత్ రెడ్డి చేయటం ఇప్పుడు చర్చగా మారింది. కేసీఆర్ బాటలో పయనిస్తున్నారన్న వేళ.. ఆయనకు భిన్నంగా చేస్తారా? లేదంటే కోరి కష్టాల్ని కొని తెచ్చుకోనున్నారా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.