వైరల్... ఇండోనేషియా అధ్యక్షుడిది ఇండియా డీఎన్ఏ అంట!
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో హాజరైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jan 2025 5:08 AM GMTభారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'రాష్ట్రపతి భవన్' లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రబోవో సుబియాంతో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటుచేసిన విదులో పాల్గొన్న ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తనది భారత డీఎన్ఏ అని, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలిందని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... కొన్ని వారాల క్రితం తాను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నానని.. అందులో తనది ఇండియా డీఎన్ఏ గా తేలిందని అన్నారు. ఇక, తనకు ఇండియన్ మ్యూజిక్ వినిపిస్తే చాలు డ్యాన్స్ చేస్తానని.. బహుశా ఇది తనలో ఉన్న భారతీయ జన్యువులలో భాగమై ఉండొచ్చని అన్నారు. దీంతో ప్రధాని, ఉపరాష్ట్రపతి గొల్లున నవ్వారు!
ఇదే సమయంలో... ఇండియా - ఇండోనేషియాకు పురాతనం పరంగా సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఇరు దేశాలకూ నాగరిక సంబంధాలు ఉన్నాయని.. రెండు దేశాల భాషలు సంస్కృత భాష నుంచే ఉద్భవించాయని.. అందుకే ఇండోనేషియాలో చాలా మంది పేర్లు సంస్కృతంలోనివే ఉంటాయని ప్రబోవో సుబియాంతో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీపైనా ప్రశంసల జల్లులు కురిపించారు ప్రబోవో. ఇందులో భగంగా... తాను భారత్ కు వచ్చినందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నట్లు చెబుతూ.. కొన్ని రోజుల క్రితమే వచ్చినప్పటికీ మోడీ నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. పేదరిక నిర్మూలను ప్రధాని మోడీ నిబద్ధత తమకు స్ఫూర్తి అని అన్నారు.
ఇదే సమయంలో.. తాను ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదని, మంచి దౌత్యవేత్తను కూడా కాదని చెప్పిన ప్రబోవో సుబియాంతో.. నా మనసులో ఏముందో అదే చెబుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో... ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.