Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలేమో కానీ నల్లు వారి సుడి తిరిగింది!

కంచు కంఠంతో తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసిన ఇంద్రసేనారెడ్డికి ఇంతకాలం కలిసి రానిది కాస్తా.. ఇప్పుడు ఆయన సుడి తిరిగిపోయింది

By:  Tupaki Desk   |   19 Oct 2023 4:24 AM GMT
తెలంగాణ ఎన్నికలేమో కానీ నల్లు వారి సుడి తిరిగింది!
X

రోజులో మొత్తం మారిపోవటం రాజకీయాల్లోనే సాధ్యం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాలం.. కర్మం బాగుండాలే కానీ ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూసినా అనుకున్నది జరగనిది.. అనుకోని రీతిలో జరిగిపోవటం మామూలే. అలాంటి సీనే మరోసారి జరిగింది. తెలంగాణ బీజేపీలో పేరున్న తొలితరం నాయకుడిగా పేరుండి.. బోలెడంత సీనియార్టీ ఉన్నప్పటికీ ఎలాంటి పదవులు లభించని నల్లు ఇంద్రసేనారెడ్డికి తాజాగా గవర్నర్ గిరి లభించింది.

కంచు కంఠంతో తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసిన ఇంద్రసేనారెడ్డికి ఇంతకాలం కలిసి రానిది కాస్తా.. ఇప్పుడు ఆయన సుడి తిరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికలు ఆయనకు ఏకంగా గవర్నర్ గిరిని తీసుకొచ్చింది. త్రిపుర గవర్నర్ గా ఆయన్ను నియమిస్తూ నిర్ణయం వెలువడింది. బీజేపీకి సుదీర్ఘ సేవలు అందించినా.. ఆయన అర్హతకు తగ్గ పదవి మోడీ సర్కార్ పదేళ్ల (దగ్గరదగ్గర) పదవీ కాలంలో జరగలేదన్న లోటు తాజా నిర్ణయంతో తీరిపోయింది.

బుధవారం రాత్రి రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడిన ఉత్తర్వుల ప్రకారం ఆయన్ను త్రిపుర గవర్నర్ గా ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు. 1953 జనవరి 1న పుట్టిన నల్లు ఇంద్రసేనా రెడ్డి.. మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పని చేసిన ఆయన.. 2003-07 కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు.

2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా.. 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన్ను నియమించినప్పటికీ.. గవర్నర్ గిరి మాత్రం దక్కలేదన్న లోటు మాత్రం మిగిలింది. తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే.. ఇంద్రసేనా రెడ్డి సమకాలీనలుగా ఉన్న నేతలంందరికి పదవులు దక్కాయి. ఆయనకు మాత్రం అలాంటిదేమీ లేకుండా పోయిందన్న లోటు ఉండేది. తాజా నియామకంతో ఆ లోటు తీరిపోయింది. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ విషయంలో.. తాము అధిక ప్రాధాన్యతను ఇస్తున్న సందేశాన్ని తాజా నియామకంతో మోడీ సర్కారు చెప్పే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు.

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతల్లో సీహెచ్ విద్యాసాగర్ రావు.. ఆ తర్వాత బండారు దత్తాత్రేయల తర్వాత గవర్నర్ పదవిని సొంతం చేసుకున్నది నల్లు ఇంద్రసేనా రెడ్డినే. ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. తాజా నియామకంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం గవర్నర్లుగా వ్యవహరిస్తున్నవారి సంఖ్య మూడుకు చేరింది.