Begin typing your search above and press return to search.

అది అహంకారం ఇచ్చిన నంబర్!

నిన్నటికి నిన్న ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ఘాటైన విమర్శలు చేస్తే తాజాగా ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అదే పంధాలో వెళ్లారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:22 PM GMT
అది అహంకారం ఇచ్చిన నంబర్!
X

అహం అన్నది ఒంటబడితే అది పతనానికి దారి తీస్తుంది అని అంటారు. దానికే ఆసరాగా చేసుకుని బీజేపీ నేతల పెద్ద రాష్ట్రీయ స్వయం సంఘ్ నేతలు వరసబెట్టి ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిన్నటికి నిన్న ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ఘాటైన విమర్శలు చేస్తే తాజాగా ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అదే పంధాలో వెళ్లారు.

అహం తలకెక్కడం వల్లనే రాముడు బీజేపీకి 241 వద్దనే ఆపేశారు అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీకి ఈ తరహా ఫలితాలు రావడం వెనక అహం పెరిగిపోవడమే కారణం అని ఆయన అంటున్నారు. రాజస్థాన్‌ జైపూర్‌లోని కనోటాలో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పెద్దల మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.

రాముడు దేవుడు అన్న వారిలో అహంకారం అంతే పాళ్ళలో పెరిగిపోయింది అని నిందించారు. వాళ్ళంతా తమను తాముగా పెద్ద పార్టీ అని ప్రకటించుకున్నారు అని కామెంట్స్ చేశారు. తాము అనుకున్నట్లుగా అంతా జరుగుతుందని భావించారని కూడా అన్నారు. కానీ చివరికి వారిని రాముడు 241 దగ్గరే ఆపేశారు అని బీజేపీకి వచ్చిన ఎంపీ సీట్లను ఉదహరించారు.

నిజానికి బీజేపీ ఈ ఎన్నికల్లో 400 సీట్లు తమ టార్గెట్ అని బరిలోకి దిగింది. నరేంద్ర మోడీ మొదలుకుని బీజేపీ పెద్ద నేతలు అంతా చేసిన ప్రచారం ఇదే. బీజేపీ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఫలితాలు చూస్తే షాక్ కొట్టాయి.

272కి రావాల్సిన సీట్లు కూడా రాలేదు. దాంతో మిత్రుల సాయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. దీంతోనే తీవ్ర అసంతృప్తిలో ఆరెస్సెస్ ఉంది. అందుకే వరసబెట్టి ఆరెస్సెస్ నాయకులు ఇండైరెక్ట్ గా బీజేపీ అగ్ర నాయకత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.

బీజేపీ నేతలకు అహంకారం ఉందని చెప్పడం ద్వారా వారి టార్గెట్ ఎవరు అన్నది చెప్పకనే చెబుతున్నారు మరి బీజేపీ తాను అనుకున్నది సాధించడంలో విఫలం అయింది. దాని మీద బీజేపీలో ఆత్మ పరిశీలన కచ్చితమైన సమీక్ష ఏదైనా ఉంటుందా అన్నది చూడాలి. బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగా తగ్గిన నేపధ్యంలో దానికి బాధ్యులుగా ఎవరు ఉంటారు అన్నది మరో చర్చగా ఉంది.

బీజేపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అని విపక్షాలు విమర్శిస్తున్న నేపధ్యం ఉంది. నైతిక ఓటమి అని ఇండియా కూటమి నేతలు బీజేపీ పెద్దలను ఎద్దేవా చేస్తున్నారు. మరి వీటికి తోడు అన్నట్లుగా ఆరెస్సెస్ కూడా బీజేపీ అగ్ర నేతల పోకడల మీద విమర్శలు ఎక్కు పెడుతోంది. దీని మీద బీజేపీ బిగ్ షాట్స్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో ఏ విధంగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టుకుంటారో చూడాల్సి ఉంది.