Begin typing your search above and press return to search.

20 శాతం పడిపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు.. కారణమిదే!

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అంతర్గత సమీక్షలో డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు.

By:  Tupaki Desk   |   11 March 2025 1:20 PM IST
20 శాతం పడిపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు.. కారణమిదే!
X

ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంక్‌ ఇండస్‌ఇండ్‌ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంక్‌ షేర్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. ప్రధానంగా బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అవకతవకలు ఇందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అంతర్గత సమీక్షలో డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంగా బ్యాంక్‌ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడనుంది. అంటే ఇది సుమారు రూ.1,530 కోట్ల నష్టానికి సమానం. ఈ ప్రకటన వెలువడిన వెంటనే షేర్లపై ఒత్తిడి పెరిగి వాటి విలువ 20 శాతం మేర తగ్గింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.14 వేల కోట్ల మేర తగ్గింది. 2023 డిసెంబర్‌ నాటికి బ్యాంక్‌ నికర విలువ రూ.65,102 కోట్లుగా ఉన్న విషయం గమనార్హం.

-ఆర్‌బీఐ నిర్ణయం ప్రభావం

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సీఈఓ సుమంత్‌ కత్పలియా పదవీకాల పొడిగింపుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయం కూడా షేర్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆర్‌బీఐ, కత్పలియాకు మూడేళ్ల కాలం కాకుండా కేవలం ఒక ఏడాది మాత్రమే పొడిగింపు మంజూరు చేసింది. ఈ ప్రకటన తర్వాత సోమవారం బీఎస్‌ఈ లో బ్యాంక్ షేరు 3.86 శాతం మేర పడిపోయి రూ.900.70 వద్ద ముగిసింది.

-ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్ల ప్రదర్శన

* గత సంవత్సరం మొత్తం బ్యాంక్ షేర్లు 42.42 శాతం మేర నష్టపోయాయి.

* గత ఆరు నెలల్లో 37.24 శాతం మేర పతనమయ్యాయి.

* మంగళవారం ఒక్కరోజే 20 శాతం నష్టపోయాయి.

ఈ పరిణామాలు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. బ్యాంక్‌ మేనేజ్‌మెంట్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.