Begin typing your search above and press return to search.

ఏపీలో ఇవి ఇండ‌స్ట్రీయిల్ పాలిటిక్స్‌...?

థ‌ర్డ్ పార్టీ సేఫ్టీ మెజ‌ర్ తీసుకోక‌పోవ‌డంతోపాటు.. పారిశ్రామిక వేత్త‌ల‌తో రాజీ ప‌డిన కార‌ణంగానే.. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 8:32 AM GMT
ఏపీలో ఇవి ఇండ‌స్ట్రీయిల్ పాలిటిక్స్‌...?
X

రాష్ట్రంలో మ‌రో రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా అన‌కాప‌ల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మాదం అనంత‌రం చోటు చేసుకున్న రాజ‌కీయాలు అంద‌రినీ నివ్వెర పోయేలా చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో దారుణంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చేరిన వారిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు.. వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశారంటూ.. వైసీపీ పై విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. పారిశ్రామిక‌ సేఫ్టీ విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని కూడా దుయ్య‌బ‌ట్టారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు కూడా రంగంలోకిదిగారు. విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్ ఆసుప‌త్రి లో ప‌ర్య‌టించి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇది పూర్తిగా కూట‌మి స‌ర్కారు వైఫ‌ల్యం అంటూ.. సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు. ఇది రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. ఇక‌, మ‌రోవైపు.. టీడీపీ అధికారిక ఎక్స్ లోనూ..వైసీపీని విమ‌ర్శిస్తూ.. పెద్ద ఎత్తున పోస్టు పెట్టారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ కార‌ణంగా.. అచ్యుతాపురం సెజ్ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

థ‌ర్డ్ పార్టీ సేఫ్టీ మెజ‌ర్ తీసుకోక‌పోవ‌డంతోపాటు.. పారిశ్రామిక వేత్త‌ల‌తో రాజీ ప‌డిన కార‌ణంగానే.. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ఇది రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. ఈ రెండు కోణాల‌ను ప‌రిశీలిస్తే.. అస‌లు వాస్త‌వం.. ఏంట‌నేది.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ చెప్పిన వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. రాజ‌కీయ ఒత్తిళ్లు.. పారిశ్రామిక వేత్త‌లు ఎక్క‌డ వెళ్లిపోతారోన‌న్న భ‌యంతోనే.. ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఇదీ.. అస‌లు వాస్త‌వం. ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌డం లేద‌ని, ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను వెళ్లిపోయేలా చేస్తున్నా ర‌ని.. గ‌తంలో వైసీపీ స‌ర్కారుపై టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేశారు. కానీ, వాస్త‌వం ఏంటి? అనేది చూస్తే.. ఇలాంటి మెజ‌ర్ మెంట్స్ పాటించాల‌ని కంపెనీల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చినందునే ఆయా కంపెనీలు వెళ్లిపోయాయి. ఓ ప్ర‌ముఖ బ్యాట‌రీల కంపెనీలో కార్మికుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని... బ్యాట‌రీల్లో వ‌స్తున్న ర‌సాయ‌నాల‌ను పీల్చి కార్మికుల ఆరోగ్యం దెబ్బ‌తింటోంద‌ని హెచ్చ‌రించినందుకు.. స‌ద‌రు కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది.

ఇక‌, తాజాగా అచ్యుతాపురం సెజ్‌లో కూడా.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఘ‌ట‌న జ‌రిగిన రోజే.. సేఫ్టీ త‌నిఖీలు జ‌రిగాయి. అంతా బాగుంద‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధ‌మై.. అక్క‌డ నుంచి వెళ్లి పోయాక‌.. గంట‌లోనే ఈ ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. అంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు కూట‌మి ప్ర‌భుత్వ‌మైనా.. చేసిన త‌ప్పులు లేవు. ఇవి.. యాజ‌మాన్యాల లోపం. వీటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తే.. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు ఎక్క‌డ పారిపోతాయో.. అన్న బెంగ స‌ర్కార్ల‌ను వేధిస్తోంది. ఇంత‌కుమించి.. ఇక్క‌డ ఏమీలేదు. కానీ, ప‌రిశ్ర‌మ ప్ర‌మాదాలు కూడా రాజ‌కీయంగా ఆయుధాలు అయ్యాయి అంతే!!