ప్రపంచాన్ని ప్రభావితం చేసే టాప్ 100లో మనోళ్లు ఎందరు?
అంతేకాదు.. వారు ప్రపంచాన్ని ఏ రీతిలో ప్రభావితం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు
By: Tupaki Desk | 18 April 2024 6:18 AM GMTప్రపంచాన్ని ప్రభావితం చేసే టాప్ 100 మంది జాబితాను విడుదల చేసింది ప్రముఖ టైమ్స్ మేగజీన్. 2024 ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో మనోళ్లు పలువురు చోటు దక్కించుకున్నారు. అంతేకాదు.. వారు ప్రపంచాన్ని ఏ రీతిలో ప్రభావితం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఈ జాబితాలో మనోళ్ల విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అజయ్ బంగా.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. బాలీవుడ్ నటి ఆలియాభట్ మాత్రమే కాదు సినీ దర్శకుడు దేవ్ పటేల్ సైతం ఈ జాబితాలో చోటు సంపాదించారు. అయితే.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారికి సంబంధించిన ప్రొఫైల్ ను పలువురు ప్రముఖులు తమ వ్యాఖ్యానాల్ని జోడించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తునన అజయ్ బంగా గురంచి అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ పేర్కొంటూ.. ‘‘ఒక కీలక సంస్థ పరివర్తనం చెందే అతి ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం.. ఉత్సుకత ఉన్న నాయకుడ్ని గుర్తించటం అంత సులువు కాదు. కానీ.. గత జూన్ లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అజయ్ బంగా ఆ పనిని తన చేతల్లో చేసి చూపించారు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అదే సమయంలో మనోడైన సత్య నాదెళ్లను ప్రస్తావిస్తూ.. ‘ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దటంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారు. మానవాళికి అది మంచి విషయం కూడా’’ అంటూ టైమ్ మేగజీన్ పేర్కొంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మనోళ్ల విషయానికి వస్తే..
- అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ జిగర్ షా
- యేల్ వర్సిటీలో ఖగోళ.. భౌతికశాస్త్రాల ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్
- భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని అస్మా ఖాన్
- ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ తదితరులు ఉన్నారు.
సాక్షి మాలిక్ విషయానికి వస్తే.. మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామా చేయాలంటూ ఆమె గళం విప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ప్రారంభించిన నిరసన చిన్నగా మొదలైనప్పటికీ అనతికాలంలోనే అది పెద్దది కావటమే కాదు.. దేశ వ్యాప్తంగా ఆమె చేస్తున్న ఆందోళనకు మద్దతు లభించింది. పెద్ద ఎత్తున క్రీడాకారులు ఆమెకు బాసటగా నిలిచారు. తప్పును తప్పుగా ఎత్తి చూపుతూ.. అందరి మద్దతు కూడగట్టుకోవటమే కాదు.. మోడీ సర్కారుకు ఎట్టకేలకు తన మొండితనాన్ని వీడేలా చేసి.. చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయటంలో సాక్షి మాలిక్ కీలక భూమిక పోషించారు. ఈ జాబితాలో రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సతీమణి యులియా నావల్నయాకు సైతం చోటు దక్కించుకోవటం గమనార్హం.