సింగపూర్ అధ్యక్షుడిగా మరోసారి భారత సంతతి వ్యక్తి!
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు.
By: Tupaki Desk | 2 Sep 2023 3:53 AM GMTప్రపంచ వ్యాప్తంగా దాదాపు చాలా దేశాల్లో కీ పొజిషన్స్ లో భారత సంతతి వ్యక్తులు చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. యూకే అయినా, అగ్రరాజ్యం అమెరికా అయినా, గూగుల్ లాంటి కంపెనీ అయినా... అక్కడ చక్రం తిప్పుతున్నది భారత సంతతి వ్యక్తులు కావడం కచ్చితంగా భారతీయులకు గర్వకారణమే! ఈ క్రమంలో తాజాగా సింగపూర్ కి మరోసారి భారత సంతతి వ్యక్తే కింగ్ అయ్యారు!
అవును... గతంలో ఇప్పటికే రెండు దఫాలు సింగపూర్ కు అధ్యక్షులుగా భారత సంతతి వ్యక్తులు పనిచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం (66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
పైగా ఇది భారీ విక్టరీ కావడం గమనార్హం. ఇందులో భాగంగా... శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్నుగరత్నం 70.4శాతం ఓట్లు సాధించగా.. చైనా సంతతికి చెందిన ఆయన ప్రత్యర్థులు ఎంగ్ కోక్ సోంగ్, టాన్ కిన్ లియాన్ లు వరుసగా 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు సాధించినట్లు ఎన్నికల అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో సుమారు 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా... వారిలో సుమారు 70శాతానికి పైగా ప్రజలు ఆల్ మోస్ట్ ఏకగ్రీవంగా అన్నట్లుగా గెలిచారంటూ సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్... ధర్మన్ షణ్ముగరత్నం అభినందనలు తెలిపారు.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఈ గ్రాండ్ విక్టరీపై షణ్ముగరత్నం సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్ వాసులు తనకు బలమైన ఆమోదం తెలిపారని.. తనను గెలిపించిన వారికందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై సింగపూర్ వాసులు ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానని ధర్మన్ తెలిపారు.
ఇదే క్రమంలో... ఇది తనకు వేసిన ఓటు కాదని చెప్పిన ధర్మన్... సింగపూర్ భవిష్యత్తుకు, ఆశావాద దృక్పథానికి వేసిన ఓటని అన్నారు.
ఇక, 2001లో పీపుల్స్ యాక్షన్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముగరత్నం.. 2011 నుంచి 2019 మధ్యకాలంలో సింగపూర్ కు ఆర్థిక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆర్థిక వేత్త గా, పౌర సేవకుడి గా ఉండేవారు.
కాగా... గతంలో భారత సంతతికి చెందిన తమిళియన్ అయిన సెల్లప్పన్ రామనాథన్.. సింగపూర్ కు అందరికన్నా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పని చేసి రికార్డు సృష్టించారు. తర్వాత 1981-85 మధ్య మలయాళీ అయిన చెంగర వీటిల్ దేవన్ నాయర్ సింగపూర్ కు అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు తాజాగా భారత సంతతికి చెందిన వ్యక్తి ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ కు అధ్యక్షుడయ్యారు!