Begin typing your search above and press return to search.

కాల్ డేటా పిటిషన్ పై విచారణ వాయిదా... మిగతా పిటిషన్ల పరిస్థితి ఇదే!

ఆ సంగతి అలా ఉంటే... టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది.

By:  Tupaki Desk   |   26 Oct 2023 11:09 AM GMT
కాల్  డేటా పిటిషన్  పై విచారణ వాయిదా... మిగతా పిటిషన్ల పరిస్థితి ఇదే!
X

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు పిటిషన్ పై విచారణ ఈ నెల 26కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈనెల 20న విచారణ చేపట్టిన న్యాయస్థానం... చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ జరిగింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు... తన అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటాను భద్రపరచాలని పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీఐడీ తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాల్ డేటా ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

ఇదే సమయంలో ఇలా కాల్ డేటాను ఇవ్వడం వల్ల అధికారుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సీఐడీ తరుపు న్యాయవాది వాదించారు. దీంతో... రేపు (అక్టోబర్ 27) మరోసారి వాదనలు వింటామని తెలిపుతూ విచారణను రేపటికి వాయిదా వేశారు. దీంతో ఈ విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా మూడు నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని.. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్‌ జరపాల్సి ఉందని పిటిషన్‌ లో పేర్కొన్నారు.

మరోపక్క స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ లపై వెకేషన్‌ బెంచ్‌ రేపు (ఈ నెల 27) విచారణ జరపనుంది. ఈ క్రమంలో... న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ పిటిషన్‌ లిస్ట్ అయ్యిందని తెలుస్తుంది.

కాగా... రాజమండ్రి సెంట్రల్ జైలు 46వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు.. స్కిల్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నవంబర్‌ 8న రానుంటుండగా... ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నవంబర్‌ 9న విచారణకు రానుంది. ఇదే సమయంలో... ఫైబర్‌ నెట్‌ కేసు పీటీ వారెంట్‌ పై ఏసీబీ కోర్టు నవంబర్‌ 10న తన నిర్ణయాన్ని వెల్లడించనుందని తెలుస్తుంది.