వినడానికే ఆశ్చర్యం.. భారత్ కోసం చేయి కలిపిన ఉక్రెయిన్-రష్యా
దాదాపు మూడేళ్లుగా యుద్ధంలో తలమునకలై ఉన్నాయి ఉక్రెయిన్-రష్యా.. 2022 ఫిబ్రవరిలో మొదలైన వీరి ఘర్షణ అనేక వేల ప్రాణాలను బలిగొంది.
By: Tupaki Desk | 10 Dec 2024 8:30 PM GMTదాదాపు మూడేళ్లుగా యుద్ధంలో తలమునకలై ఉన్నాయి ఉక్రెయిన్-రష్యా.. 2022 ఫిబ్రవరిలో మొదలైన వీరి ఘర్షణ అనేక వేల ప్రాణాలను బలిగొంది. లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అలాంటి ఉక్రెయిన్-రష్యా ఇప్పట్లో సంధికి వస్తాయనే నమ్మకం లేదు. కానీ, చేతులు కలిపాయి. వినడానికే ఆశ్చర్యం కలిగించే పరిణామం భారత్ కారణంగా చోటుచేసుకుంది.
తురుపుముక్క ఐఎన్‌ఎస్ తుశిల్..
రష్యా నౌక.. ఉక్రెయిన్ ఇంజిన్.. భారత్ ఆర్డర్.. డెడ్లీ కాంబినేషన్ ఇది. ఎందుకంటే.. ఉక్రెయిన్- రష్యా పూర్తిగా యుద్ధంలో ఉన్నాయి. ఈ రెండు దేశాలకు శాంతి వచనాలు బోధిస్తోంది భారత్. పైగా తమది ఎవరి పక్షమూ కాదని శాంతి పక్షమని చెబుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధం మొదలయ్యాకే రెండు దేశాల్లోనూ పర్యటించారు. ప్రపంచంలో మరే నాయకుడికీ ఇలాంటి ప్రత్యేకత దక్కలేదు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ ఓ విషయమై ఏకకాలంలో భారత్ కోసం వేర్వేరుగా పని చేశాయి. అదే ఐఎన్‌ఎస్ తుశిల్.
చేతుల కలిపేలా చేసింది..
ఐఎన్‌ఎస్ తుశిల్ ఓ యుద్ధ నౌక. నిన్న రష్యా రాజధాని మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతులమీదుగా నౌకా దళంలో చేరింది. ఫ్రిగెట్ శ్రేణికి చెందినది ఈ నౌక. ఇలాంటివి రెండింటి కోసం భారత్ 2016లో రష్యాకు ఆర్డర్ పెట్టింది. మరో రెండింటిని గోవాలో నిర్మించేలా ఆర్డర్ ఇవ్వబోతోంది.
ఐఎన్‌ఎస్ తుశిల్ ను రష్యాలో క్రివాక్-3 శ్రేణి యుద్ధ నౌకగా వ్యవహరిస్తారు. అత్యాధునిక స్టెల్త్ మిసైల్ ఫ్రిగెట్. ఇలాంటివి ఆరు నౌకలు ఇప్పటికే భారత్ కు ఉన్నాయి. మొత్తం రష్యాలో తయారైనవే. ఫ్రిగెట్లకు గ్యాస్ టర్బైన్ ఇంజిన్ వాడారు. భారత్ కోసం రష్యా యుద్ధ నౌకకు ఉక్రెయిన్ ఇంజిన్ సమకూర్చింది.
మరోవైపు యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న ఈ సమయంలో డెలివరీ చేసింది. అయితే, ఐఎన్‌ఎస్ తుశిల్ డెలివరీలో ఎలాంటి ఇబ్బందీ రాకుండా భారత్ రెండు దేశాలతో సమన్వయం చేసుకుంది. ఉక్రెయిన్ నుంచి ఇంజిన్లను సేకరించి రష్యాకు తరలించి.. అక్కడ నౌకల్లో బిగించింది. తుశిల్ బరువు 3,900 టన్నులు. పొడవు 125 మీటర్లు. భారత పరిజ్ఞానం వాటా 26 శాతం
చాలా కాలంగా భారత్ లో వాడే అత్యధిక యుద్ధ నౌకలకు ఇంజిన్లను ఉక్రెయిన్ కంపెనీ జోరియా-మష్ తయారుచేస్తోంది. ఇది అత్యుత్తమ కంపెనీ. తుశిల్ అంటే రక్షా కవచం. మల్టీ రోల్, స్టెల్ మిసైల్ ఫ్రిగెట్. ‘నిర్భయ, అభేద్య ఔర్ బల్‌శీల్’ అనేది నినాదం.
గతంలో రష్యా వాడిన అడ్మిర్ గ్రిగరోవిచ్ శ్రేణి ఫ్రిగెట్లను అభివృద్ధి చేసి ఈ ‘తల్వార్ క్లాస్’ నౌకను ప్రాజెక్ట్ 11356లో భాగంగా నిర్మించారు. దీని తయారీని భారత టీమ్ రష్యా పెద్ద నగరాల్లో ఒకటౌన కలినిన్ గ్రాడ్‌లో ఉండి చూసుకుంది. ఇందులో భారత్ తయారుచేసిన అత్యాధునిక క్షిపణులను అమర్చవచ్చు. జనవరిలో జరిగిన సముద్ర పరీక్షల సమయంలో అత్యధికంగా 30 నాట్స్ వేగం అందుకుంది.