Begin typing your search above and press return to search.

ఇంటర్ బోర్డు ఇంకా అప్డేట్ కాలేదా? ఆర్థిక మంత్రి హరీశ్?

తాజాగా జరరగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా హరీశ్ రావు పేరును ప్రస్తావించటం వివాదంగా మారింది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 11:30 AM GMT
ఇంటర్ బోర్డు ఇంకా అప్డేట్ కాలేదా? ఆర్థిక మంత్రి  హరీశ్?
X

కొన్ని తప్పులు అస్సలు జరగకూడదు. ఓవైపు గ్రూప్ వన్ పరీక్షల నిర్వాహణ చేతకాలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.. కేసీఆర్ నాయకత్వాన్ని తీవ్రంగా ఎండగట్టే నేతగా రేవంత్ రెడ్డి సుపరిచితుడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఉద్యోగనియామక పరీక్షల్ని నిర్వహించే విషయంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటం తెలిసిందే. అలాంటప్పుడు తమ ప్రభుత్వం నిర్వహించే పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా?

తాజాగా జరరగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా హరీశ్ రావు పేరును ప్రస్తావించటం వివాదంగా మారింది. ఈ విషయంలో ఇంటర్ బోర్డు తీరును పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం మారి..కొత్త మంత్రులు కొలువు తీరిన తర్వాత కూడా ఇంటర్ బోర్డు ఇంకా ఆప్డేట్ కాకపోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఇంటర్ విద్యకు సంబంధించి ఇంగ్లిష్ సబ్జెక్టులో మొదటిసారి ప్రాక్టికల్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 20 మార్కులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పరీక్ష నిర్వహించారు. ఈ ప్రాక్టికల్ కోసం ఒక వర్కు బుక్ ను పబ్లిష్ చేవారు. ఇంగ్లిష్ భాషలో రాయటం.. చదవటం లాంటి అంశాల్లో విద్యార్థులు మెరుగైన అవగాహన కల్పించటం దీని ఉద్దేశం.

ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష లో చూసి చదివే విభాగంలో వర్కుబుక్ లోని పేరా 26ను ప్రశ్న రూపంలో ఇచ్చారు. అందులో సిద్ధిపేట లో స్వచ్ఛ బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించినట్లుగా ఉండటం గమనార్హం. అయితే.. ప్రశ్నాపత్రాల్ని ఎన్నికలకు ముందు ముద్రించటం వల్ల ఇలా జరిగిందని చెబుతున్నప్పటికీ.. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి ప్రస్తావన ఉన్న అంశాల్ని ఎందుకు ఎంచుకోవాలి?

అన్నది ప్రశ్న. ఒకవేళ ఎంచుకున్నప్పుడు.. ప్రభుత్వం మారినప్పుడు వెంటనే వాటిని తొలగించి.. కొత్త పత్రాల్ని తయారు చేయించాల్సిన అవసరం ఉంది. కొందరు అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇలాంటివి ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకురావటం ఖాయం. తాము ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేయలేదని అధికారులు చెబుతున్నా.. వారి వాదనలో పస లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.