ఆత్మీయ ఆలింగనం... పవన్ - బొత్స మధ్య ఆసక్తికర సన్నివేశం!
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ సందడి జరుగుతోంది.
By: Tupaki Desk | 22 Nov 2024 6:22 AM GMTమీడియా ముందు సమావేశాల్లో అయినా.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లో అయినా.. నేతల్లో అయినా, కార్యకర్తల్లో అయినా.. ఉప్పు - నిప్పు, మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గు అన్నట్లుగా ఉండే రెండు రాజకీయ పార్టీలుగా చెప్పే వైసీపీ, జనసేన లకు చెందిన నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే...?
అవును... వైసీపీ - జనసేన మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందని.. వైసీపీ పతనమే పవన్ లక్ష్యమని.. రకరకాల కామెంట్లు వినిపిస్తూ, వాటిని బలపరిచే పలు సంఘటనలు తెరపైకి వస్తున్నాయని చెబుతోన్న వేళ అసెంబ్లీ ప్రాంగణంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ సందడి జరుగుతోంది. ఇది సాంప్రదాయం ప్రకారం వైసీపీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అంటుంటే... చంద్రబాబు మాత్రం ఎన్నికలకు తెరలేపి మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు! దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇంత రసవత్తర సమయంలో.. ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందులో భాగంగా.. పీఏసీ ఎన్నిక వేళ.. ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ - వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ సమయంలో పవన్ ను బొత్స ఆప్యాయంగా పలకరించారు!
అనంతరం ఇద్దరూ అత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు కొన్ని క్షణాల పాటు పలకరించుకుని, నవ్వుకుని.. ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఇలానే ఉండేవారని.. కాకపోతే ఇప్పుడు పార్టీల వారీగా బద్ద శత్రువులుగా మారిపోయారని అంటున్నారు!