Begin typing your search above and press return to search.

ఎలక్షన్ సీజన్... రు.50 వేలకు ఎసరు తెచ్చిన రూ.500..!

ఈ సమయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ. 50వేల కంటే ఐదొందలు ఎక్కువ నగదు ఉండటంతో ఆ మొత్తన్ని స్వాధీనం చేసుకున్నారు!

By:  Tupaki Desk   |   2 April 2024 12:30 PM GMT
ఎలక్షన్  సీజన్... రు.50 వేలకు ఎసరు తెచ్చిన రూ.500..!
X

ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే... తనిఖీల్లో చాలా చోట్ల లక్షలు, కోట్ల రూపాయల నగదు దొరుకుతుంటుందనే వార్తలు మీడియాలో చల్ చల్ చేస్తుంటాయి. ఇదే సమయంలో ఎన్నికల్లొ తాయిలాలుగా ఇస్తారని చెప్పే చీరలు, గోడ గడియారాలు, రైస్ కుక్కర్లు మొదలైన వస్తువులు కూడా భారీ సంఖ్యలో గోడౌన్స్ లోనూ, ఇళ్లల్లోనూ దొరుకుతుంటాయి! దీంతో.. వాటిని అధికారులు సీజ్ చేస్తారు! తగిన పత్రాలు చూపించాలని చెబుతుంటారు.

ఒక్కోసారి ఎలక్షన్ సీజన్ లో జరిగే పెళ్లివారికి కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది. షాపింగ్ కోసం లక్షల రూపాలయ డబ్బులు కార్లలో పెట్టుకుని తీసుకెళ్తుండటం.. మార్గమధ్యలో అధికారుల తనిఖీల్లో పట్టుబడటం.. ఆనాక ప్రూఫ్ లు చూపించి వెనక్కి తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ సమయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ. 50వేల కంటే ఐదొందలు ఎక్కువ నగదు ఉండటంతో ఆ మొత్తన్ని స్వాధీనం చేసుకున్నారు!

అవును... పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన నరసింహమూర్తి విజయవాడకు బయలుదేరారు. ఈ సమయంలో ఆయన కారు బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపించేసరికి.. 16వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద అధికారులు తనిఖీల నిమిత్తం నరసింహమూర్తి కారుని ఆపారు. ఈ సమయంలో కారంతా తనిఖీ చేశారు. ఈ క్రమమంలో ఆయన వద్ద రూ.50,500 నగదు ఉన్నట్లు గుర్తించారు.

దీంతో.. అధికారులు ఆ మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో షాక్ తినడం నరసింహమూర్తి వంతైందని తెలుస్తుంది. వాస్తవానికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి దగ్గర రూ. 50 వేలకు మించి నగదు ఉండకూడదనే నిబంధన ఉంది. అయితే నరసింహమూర్తి కూడా ఆ విషయం తెలిసే రూ.50,000 వరకూ వెంట పెట్టుకున్నట్లున్నారు!

వాటితో పాటు ఒక రూ.500 అదనంగా పెట్టుకున్నారంట. దీంతో... ఏభై వేల కంటే ఒక్క రూపాయి అదనంగా ఉన్నా రూల్ వర్తిస్తుందని చెప్పిన అధికారులు... ఆ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు! తగిన ఆధారాలు చూపించి నిబంధనల మేరకు తర్వాత వచ్చి తీసుకువెళ్లమని చెప్పి పంపేశారు. వ్యక్తిగత అవసరాల మేర ఈ మొత్తంతో వెళ్తున్నానని.. రూ.500 మాత్రమే ఎక్కువగా ఉన్నందున వదలమని కోరినా.. అధికారులు అంగీకరించలేదట!!