Begin typing your search above and press return to search.

మహిళా దినోత్సవం ఎలా మొదలైంది? ఆ చరిత్ర ఏంటి?

ఈ ప్రత్యేక దినాన్ని పురుషుల సరసన మహిళలు అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందాలని కోరుతూ జరుపుతారు. ఈ రోజును జరుపుకోవడం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది.

By:  Tupaki Desk   |   8 March 2025 10:43 AM IST
మహిళా దినోత్సవం ఎలా మొదలైంది? ఆ చరిత్ర ఏంటి?
X

మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ.. మనకు అండదండగా ఉంటూ.. మన సక్సెస్ ను తన సక్సెస్ గా భావించే ప్రతీ మహిళా ఈ మహిళా దినోత్సవం రోజు గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యురాలు.. ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినాన్ని పురుషుల సరసన మహిళలు అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందాలని కోరుతూ జరుపుతారు. ఈ రోజును జరుపుకోవడం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది.

- మహిళా దినోత్సవ నేపథ్యం

మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు తమ హక్కుల కోసం ప్రదర్శన నిర్వహించారు. వారు ఓటు హక్కు, మెరుగైన వేతనాలు, పని సమయాల్లో తగ్గింపు కోరుతూ నిరసనకు దిగారు. ఈ సంఘటన చరిత్రలో ఒక మైలురాయి అయింది.

ఈ సంఘటన ప్రభావంతో 1909లో అమెరికాలోని సోషలిస్టు పార్టీ ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. తర్వాత 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లో జరిగిన మహిళల అంతర్జాతీయ సదస్సులో జర్మన్ సోషలిస్ట్ నేత క్లారా జెట్కిన్ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అనేక దేశాల్లో ఆదరణ పొందింది.

- మార్చి 8 ఎందుకు?

1917లో రష్యాలో మహిళలు రొటీన్‌గా జరిపిన నిరసన పెద్ద ఉద్యమంగా మారి అది ఫిబ్రవరి చివరి వారంలో జరిగింది. రష్యాలో ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్ అమలులో ఉండడంతో ఆ రోజును మార్చి 8గా గుర్తించారు. 1975లో ఐక్యరాజ్యసమితి (UN) అధికారికంగా ఈ తేదీని మహిళా దినోత్సవంగా ప్రకటించింది.

- ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ ప్రాముఖ్యత

ఈ రోజున వివిధ దేశాల్లో మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం, ఉపాధి, హక్కులు వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. మహిళల దినోత్సవం కోసం ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ నిర్ణయించబడుతుంది. ఈ వేడుక ద్వారా సమాజంలో లింగ సమానత్వం, మహిళల హక్కులపై అవగాహన పెంచడం లక్ష్యం.

- మహిళా దినోత్సవం ప్రాముఖ్యత

*మహిళలకు సమాన హక్కులను ప్రసాదించేందుకు గుర్తింపు

*లింగ వివక్షను తగ్గించే మార్గాలను అన్వేషించడం

*మహిళల విజయాలను ప్రోత్సహించడం

*మహిళల సాధికారత కోసం చర్యలు తీసుకోవడం

మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మహిళల హక్కులకు సంబంధించిన ఉద్యమానికి గుర్తుగా నిలుస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ రోజును గౌరవంగా గుర్తించి, మహిళల సాధికారతకు తోడ్పడాలి. మహిళల హక్కులను కాపాడడం, సమానత్వాన్ని నెలకొల్పడం మనందరి బాధ్యత.