నేడు అంతర్జాతీయ బీర్ దినోత్సవం.. ఫస్ట్ బీర్ ఎప్పుడు తయారయ్యింది?
2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్ కు చెందిన జెస్సే అవ్ షాలోమోవ్న్ అనే బీరు ప్రియుడు ఈ బీర్ డే పుట్టుకకు కారణం అయ్యాడు.
By: Tupaki Desk | 4 Aug 2023 11:06 AM GMTప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం జరిగే వేడుక.. అంతర్జాతీయ బీర్ డే! ఈ వేడుకలో బీర్ ప్రియులు ఒకచోట చేరి కొత్త బీర్లను ప్రయత్నిస్తూ.. ఇష్టమైన రకాలను స్నేహితులు, అపరిచితులతో పంచుకుంటారు. ఈ పానీయం తాగుతూ రోజంతా ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తారు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం అందరికీ తెలిసినప్పటికీ... పరిమితంగా మద్యం లేదా బీరు వంటివి తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాలు తేల్చాయని అంటుంటారు. ఈ నేపథ్యంలో సాధారణంగా వేసవి వచ్చిందంటే బీరు ఏరై పారుతుంటుంది.
ఇదే సమయంలో బీరు మితంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కూడా అంటుంటారు. ఈ నేపథ్యంలో బీరు దినోత్సవాన్ని పురష్కరించుకుని... అసలు ఈ బీరు ఫస్ట్ ఎప్పుడు తయారైంది.. ఎక్కడ తయారైంది.. బీరు వెనక ఉన్న చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
దాదాపుగా ఏడువేల సంవత్సరాల క్రితం, మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్ మొదలైంది. ఆరోజుల్లో మహిళలు బలవర్థకమైన ఆహారం కోసం అంబలి కాచుకునేవాళ్లు. అయితే కొందరు ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను జోడించి నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసుకునేవాళ్లు.
ఈ నేపథ్యంలో... అలా చేసుకున్న పానియాలను నిల్వ బెట్టడం చేస్తుండేవారు. దీంతో అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచి అందించేవి. అనంతరం అవి మత్తు ద్రావణాలనే ప్రచారం జరగడంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. అలా మొదలైంది ఈ మత్తుపానియాల వ్యవహారం.
మధ్యయుగం నాటికి.. పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం, వినియోగం విపరీతంగా పెరిగింది. అన్నివర్గాలవారూ ఆ పానీయాలకు అలవాటు అయ్యారు. ఈ నేపథ్యంలో 11వ శతాబ్దంలో జర్మనీకి చెందిన హిల్డె గార్డ్ ఆఫ్ బింగెన్ విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్ కు ఒక రూపం వచ్చింది.
ఈ క్రమంలో ఇంత చరిత్ర కలిగిన ఈ బీరుకు ఒక పుట్టిన రోజు వేడుక జరపాలని భావించారు. ఇందులో భాగంగా... 2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్ కు చెందిన జెస్సే అవ్ షాలోమోవ్న్ అనే బీరు ప్రియుడు ఈ బీర్ డే పుట్టుకకు కారణం అయ్యాడు. ఈయనే... ఆగష్టు మొదటి శుక్రవారంను బీర్ డే గా నిర్వహించుకోవాలని మందుబాబులకు సూచించాడు!
అలా మొదలైన ఈరోజును నేడు దాదాపు 80కిపైగా దేశాల్లో, ప్రధానంగా 200 నగరాల్లో ఈ బీర్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు మందుబాబులు. ఈ లిస్ట్ లో భారతదేశం కూడా ఉంది.
ఇక ఇతర హార్డ్ డ్రింక్స్ తో పోలిస్తే.. బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బీరులో నాలుగు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. అయితే ఇది బ్రాండ్ ని బట్టి.. లైట్ - స్ట్రాంగ్ ని బట్టి మారుతుంది. దీంతోపాటు బీరులో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పెద్దగా ఉండదని అంటుంటారు.
ఇదే సమయంలో కిడ్నీలలో ఏర్పడే రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి బీరు తోడ్పడుతుందని అంటుంటారు. ఈ వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపేందుకు బీరు సాయం చేస్తుందని చెబుతుంటారు. దీంతో... మితమైన మద్యపానానికి బీరు అనువైనదని చెబుతుంటారు. ఏది ఏమైనా.. ఈ రోజు మందుబాబులందరికీ బీర్ దినోత్సవ శుభాకాంక్షలు!