భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ బాబు..న్యూయార్క్ టైమ్స్ లో కథనం
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Jun 2024 7:46 AM GMTఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 16 మంది ఎంపీలు ఉన్న టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కింగ్ మేకర్ అంటూ జాతీయ మీడియా ప్రశంసలతో కథనాలు రాస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ మీడియాలో సైతం చంద్రబాబును కింగ్ మేకర్ గా అభివర్ణిస్తూ కథనాలు వెలువడుతున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో భారత రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యతను గురించి ప్రత్యేక కథనం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టెక్నాలజీకి రెండు దశాబ్దాల కిందటే పెద్ద పీట వేశారని, ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, రాయితీలిస్తామని కంపెనీలను 20 ఏళ్ల కిందటే ఆహ్వానించారని ఆ కథనంలో రాశారు. చంద్రబాబు పాలనాపరమైన నిర్ణయాల వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు దేశవిదేశాలలో లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ స్థిరపడ్డారని ఆ కథనంలో పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ద్వారా వేలాది కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడంలో చంద్రబాబుది కీలక పాత్ర అని ఆ కథనంలో కొనియాడారు. దేశంలోని పేరు మోసిన ఐటీ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకురావడంలో, హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో చంద్రబాబుది కీలకపాత్ర అని రాశారు. ఐటీ కంపెనీలకు స్వర్గధామంగా నిలిచి ప్రపంచ స్థాయి రాజధానిగా హైదరాబాద్ ఎదగడంలో చంద్రబాబు కృషి ఎంతైనా ఉందని గుర్తు చేశారు.
ప్రస్తుతం మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని, చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉందని రాసుకొచ్చారు. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ నుంచి, వైసీపీ నేతల నుంచి ర్యాగింగ్ ఎదుర్కొన్న చంద్రబాబు ఈ రోజు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని ఆ ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోని ఈ కథనంపై టీడీపీ అభిమానులు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ లో చంద్రబాబుకు ఇచ్చిన ఎలివేషన్ కేజీఎఫ్ సినిమాలో రాఖీ భాయ్ కి ఇచ్చిన ఎలివేషన్ కన్నా ఎక్కువ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.