పార్లమెంటు ఎన్నికల్లోనూ పై 'చేయే'.. తాజా సర్వే
వచ్చే ఏడాది అంటే.. మరో నాలుగు మాసాల్లో పార్లమెంటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 23 Dec 2023 4:40 PM GMTఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించి సీట్లు దక్కించుకుని మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారం దక్కించు కున్న కాంగ్రెస్ పార్టీకి.. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే స్థాయిలో విజయం దక్కనుందనే అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది అంటే.. మరో నాలుగు మాసాల్లో పార్లమెంటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీకి ఎన్ని పార్లమెంటు స్థానాలు దక్కుతాయనే అంశంపై ఏబీపీ-సీవోటర్ సర్వే నిర్వహించింది.
ఈ సర్వే ప్రకారం.. మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ మరోసారి తన సత్తా చాట నుందని సర్వే స్పష్టం చేసింది. అదేసమయంలో ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ మరింత దెబ్బతింటుందని పేర్కొంది. అదేవిధంగా బీజేపీ ప్రస్తుత మున్న నాలుగు స్థానాల నుంచి ఏకంగా ఒక స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని కూడా తెలిపింది. ఇక, ఓట్ల షేరింగ్ విషయాన్ని కూడా సర్వే స్పష్టం చేసింది. ఓట్ల షేరింగ్‌లోనూ.. కాంగ్రెస్‌దే పైచేయిగా పేర్కొంది. ఆయా వివరాలు ఇవీ..
లోక్ సభ సీట్లు ఏ పార్టీకి ఎన్ని
కాంగ్రెస్ - 9 నుంచి 11
బీఆర్ ఎస్ - 3 నుంచి 5
బీజేపీ - 1 నుంచి 3
ఇతరులు - 1 నుంచి 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
ఓట్ల షేరింగ్ ఇలా..
కాంగ్రెస్ పార్టీ - 38 శాతం
బీఆర్ ఎస్ పార్టీ - 33 శాతం
బీజేపీ - 21 శాతం
ఇతరులు - 8 శాతం దక్కించుకునే చాన్స్ ఉందని సర్వే ప్రకటించింది.